‘సాక్షి’ మాక్ ఎంసెట్ విజేతలకు బహుమతులు
హైదరాబాద్ : ‘సాక్షి’ మాక్ ఎంసెట్ విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తుందని ‘సాక్షి’ టీవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి అన్నారు. ‘సాక్షి’ టీవీ స్టూడియోలో బుధవారం ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఎస్‌వీ సెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ - 2015లో హైదరాబాద్ రీజియన్‌లో విజేతలుగా నిలిచిన ర్యాంకర్లకు నగదు బహుమతిని అందజేశారు.ఈ సందర్భంగా రాణిరెడ్డి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించిందన్నారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరే ఇలాంటి పరీక్షలు రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తామన్నారు. ‘సాక్షి’ ఫైనాన్స్ , అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ వైఈపీ రెడ్డి మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక మొదటి నుంచి విద్యార్థుల పక్షపాతిగా నిలుస్తోందన్నారు.
‘సాక్షి’ మార్కెటింగ్ డెరైక్టర్ కె.ఆర్.పి. రెడ్డి మాట్లాడుతూ ఈ మాక్ ఎంసెట్‌కు ఎస్‌వీ సెట్ వారు స్పాన్సరర్స్‌గా వ్యవహరించారని తెలిపారు. సెంట్రల్ ఆంధ్రా రీజియన్ స్పాన్సర్స్‌గా నలంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వ్యవహరించిందన్నారు. తిరుపతి వరకు తిరుపతి పట్టణ శ్రీరామ ఇనిస్టిట్యూట్ వారు సహకరించారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రీజియన్‌లో మాక్ ఎంసెట్‌లో విజేతలైన పది ర్యాంక్‌ల లోపువారికి నగదు బహుమతులు అందజేశారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ. 10 వేలు, రూ.5 వేలు నగదు మొత్తాన్ని, ప్రశంసాపత్రం అందజేశారు. మాక్ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో డి. తేజ వర్దన్ రెడ్డి(ఫస్ట్ ర్యాంక్) , ఎం. రాహుల్ (5వ ర్యాంక్), జి. రాధ రేవతి (8వ ర్యాంక్), బి.అనుదీప్ రెడ్డి( 9వ ర్యాంక్), ఎ. అనుదీప్( 11వ ర్యాంక్), మెడికల్ విభాగంలో కేపీ అనూహ్య(ఫస్ట్ ర్యాంక్), ఎస్ ప్రణయ్ రెడ్డి( 2వ ర్యాంక్), కె. మౌక్తిక ( 3వ ర్యాంక్), జి. నిఖిల్ రెడ్డి( 5వ ర్యాంక్), ఎ. ప్రియాంక( 6వ ర్యాంక్), ఎ. పుష్ప చందన( 9వ ర్యాంక్) సాధించారు. వీరికి ‘సాక్షి’ టీవీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ వైఈపీ రెడ్డిల చేతుల మీదుగా నగదు బహుమతిని అందజేశారు.