
పెసలిస్తే పోస్టు మీకే!
అంగన్‌వాడీ పోస్టుల భర్తీ అక్రమార్కులకు వరంగా మారింది.
పెసలిస్తే పోస్టు మీకే!
న్యూస్‌లైన్: అంగన్‌వాడీ పోస్టుల భర్తీ అక్రమార్కులకు వరంగా మారింది. అంగట్లో సరుకులా వీటికి ఓ రేటు ఫిక్స్ చేసి పైరవీలు చేస్తున్నారు. అభ్యర్థుల టాలెంట్, అనుభవం, అర్హతలతో సంబంధం లేకుండానే రికమండేషన్‌లు, కాసులు ఖర్చుపెడితే సరి.. పోస్టులు వరిస్తాయనే ప్రచారానికి తెర లేపారు.
ఈ తతంగమంతా కొందరు నాయకుల కనుసన్నల్లోనే సాగుతోందంటే దీని వెనకాల ఏ స్థాయి నేతలున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పరిగి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 215 అంగన్‌వాడీ లింక్ వర్కర్లను నియమించేందుకు గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టపర్చటం, పూర్వ ప్రాథమిక విద్యను అందించటం తదితర కారణాలతో.. ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలతో పాటు ప్రతి సెంటర్‌కూ అదనంగా అంగన్‌వాడీ లింక్ వర్కర్లను నియమించేందుకు మాతా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఆయా పోస్టుల కేటగిరీలకు సంబంధించి మొత్తం 228 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
చెల్లని దరఖాస్తులే ఎక్కువ
పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు తక్కువ సమయం ఉండటం, ఇచ్చిన గడువులోపు కులం తదితర ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు అభ్యర్థులకు వీలుపడలేదు. దరఖాస్తులు ఆహ్వానించిన సమయంలో తహసీల్దార్లు బదిలీ కావటం, దీంతోపాటు వారు కార్యాలయాలకు సమయం కేటాయించకపోవటం తదితర కారణాలతో చాలా మంది పాత ధ్రువీకరణ పత్రాలతోనే దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో సగానికిపైగా చెల్లవంటూ అధికారులు తిరస్కరించారు. దీంతో కొన్ని గ్రామాలకు ఐదునుంచి 10 వరకు దరఖాస్తులే వచ్చాయి. మరికొన్ని గ్రామాలకు ఒక్క దరఖాస్తూ అందలేదు. ప్రధాన అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్న చోట పోటీ మరీ ఎక్కవగా ఉంది. ప్రస్తుతం 228 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించి వారికి కాల్‌లెటర్లు అందజేశారు. మిగతా 200పైగా దరఖాస్తులు ఆయా కారణాలతో చెల్లనివిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన వారు ప్రస్తుతం దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచటమో, లేదంటే మరోసారి నోటిఫికేషన్ ఇవ్వడమో చేయాలని కోరుతున్నారు.
పెరిగిన పోటీ
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసేందుకు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలు దొరికేవారు కాదు. గ్రామాల్లో చదువుకున్న మహిళలు కూడా ఉండేవారు కాదు. దీంతో సంవత్సరాల తరబడి కొన్ని సెంటర్లు కార్యకర్తలు లేక ఖాళీగానే ఉండేవి. కొన్నిచోట్ల వేరే గ్రామాలనుంచి కూడా కార్యకర్తలను ఎంపిక చేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామాల్లో చదువుకున్న మహిళలు పెరిగిపోవటం, ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు మెరుగుపడటం, భవిష్యత్తులో పర్మినెంట్ కావచ్చనే ఆశలు ప్రస్తుతం పోటీ తీవ్రతను పెంచేశాయి.
ప్రారంభమైన పైరవీలు
దరఖాస్తులు చేసుకున్నది మొదలు అంగన్‌వాడీ పోస్టులు దక్కించుకునేందుకు ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. ఆయా గ్రామాల లీడర్లు పెద్ద నేతలను కలిపించేందుకు పావులు కదుపుతున్నారు. గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు మొదలుకుని అమాత్యుల వరకూ పైరవీలు కొనసాగుతున్నాయి. ఎలాగైనా పోస్టులు దక్కించుకునేందుకు ఆశావహులు ఉవ్విళ్లూరుతుండగా.. ఇదే అదనుగా భావించిన నాయకులు, పైరవీకారులు వారి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిన్ అంగన్‌వాడీ పోస్టులకు పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. లింక్ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ పోస్టులకు సైతం రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.