నరసన్నపేట : అవినీతి నిరోధక శాఖ వలలో వాణిజ్యపన్నుల శాఖ అధికారి (సీటీవో) చిక్కారు. ఓ హోటల్‌కు సంబంధించి వ్యాట్ లైసెన్స్, ఇద్దరు పేరున ఉన్న వ్యాట్ లెసెన్స్ రద్దు కోసం ఊణ్ణ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి మంగళవారం పది వేల రూపాయల లంచం తీసుకుంటూ నరసన్నపేట సీటీవో కె.నాగరాజు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలోని లక్ష్మీ టాకీస్ వద్ద ఊణ్ణ వెంకటేశ్వరరావు పేరున అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ ఉంది. దీన్ని ఎన్.గోవిందరావు అనే వ్యక్తి ఇటీవల లీజుకు తీసుకున్నారు. ఈయన పేరున వ్యాట్ లైసెన్స్ కావాలని సీటీఓను వెంకటేశ్వరరావు సంప్రదించారు. అయితే అప్పటికే గోవిందరావు పేరున మరో చిరునామాతో వ్యాట్ లైసెన్స్ ఉంది. దీన్ని రద్దు చేస్తేనే కొత్తది ఇవ్వగలమని సీటీఓ స్పష్టం చేశారు. అలాగే వెంకటేశ్వరరావు, గోవిందుల పేరున ఉన్న వ్యాట్ లైసెన్స్‌లు రద్దు చేస్తూ కొత్తగా అన్నపూర్ణ గార్డెన్ రెస్టారెంట్ పేరుతో గోవింద్‌కు కొత్తగా వ్యాట్ రిజిస్టేషన్ కావాలని వీరు కోరారు.
ఈ పనులన్నీ పూర్తికావాలంటే 25 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని సీటీవో నాగరాజు డిమాండ్ చేయగా.. పది వేల రూపాయలు ఇచ్చేందుకు హోటల్ నిర్వాహకులు అంగీకరించినట్టు డీఎస్పీ చెప్పారు. తరువాత లంచం డిమాండ్ చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి వెంకటేశ్వరరావు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన చేతికి పది వేల రూపాయలు ఇచ్చి.. సీటీవోకు ఇవ్వాలని మంగళవారం మధ్యాహ్నం పంపించామన్నారు. కార్యాలయంలోనే వెంకటేశ్వరరావు నుంచి సీటీవో నాగరాజు లంచం తీసుకుంటుండగా.. దాడి చేసి రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నట్టు వివరించారు. సీటీవోను అరెస్టు చేశామని..విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో బుధవారం హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు.
స్థానికంగా సంచలనం
అవినీతి నిరోధక శాఖ అధికారులకు సీటీవో చిక్కిన విషయం నరసన్నపేటలో సంచలనమైంది. సీటీఓ నాగరాజు ఉదయం 11 గంటలకే కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ విధులు నిర్వహించుకుంటున్నారు. ఒంటి గంట సమయంలో హోటల్ యజమాని వెంకటేశ్వరరావు సీటీవో కార్యాలయానికి రావడం, కొద్ది సమయానికే ఏసీబీ అధికారులు దాడి చేసి సీటీవోను అదుపులోకి తీసుకోవడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏసీబీ దాడుల్లో సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏసీబీకి చిక్కిన సీటీవో
Published Wed, Mar 15 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
Advertisement
Advertisement