సాక్షి ప్రతినిధి, అనంతపురం : జన‘సునామీ’ ముందు తుఫాన్ కొట్టుకుపోయింది. ప్రజా ఉప్పెన దెబ్బకు వరదలు చిన్నబోయాయి. వరదల ఉద్ధృతికి రోడ్లన్నీ కోసుకుపోయినా జనప్రవాహాన్ని నిలువరించలేకపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభకు జనం పోటెత్తారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో చేకూరిన కష్టనష్టాలను పక్కన పెట్టి.. ఆటంకాలను అధిగమించి భారీ ఎత్తున ‘అనంత’ ప్రజానీకం సమైక్య శంఖారావం సభలో కదం తొక్కడం వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహాన్ని నింపింది. సమైక్యవాదులకు రెట్టించిన బలాన్నిచ్చింది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘సమైక్య శంఖారావం’ సభ దిగ్విజయవంతమవడం అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని దెబ్బతీసింది.
అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు పేర్కొనే యువకులు, మహిళలు అధిక శాతం మంది వైఎస్సార్‌సీపీకి దన్నుగా ‘సమైక్య శంఖారావం’ సభకు తరలివెళ్లడం కాంగ్రెస్, టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తెలుగుజాతి మనోభావాల మేరకు సమైక్య ఉద్యమ బావుటా ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని వేదికగా శనివారం ‘సమైక్య శంఖారావాన్ని’ పూరించారు. నాలుగు రోజులుగా జిల్లాలో ఎడతెగకుండా కురుస్తోన్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. వేరుశనగ పంటకు అపారనష్టం వాటిల్లింది. కానీ.. ఆ కష్టనష్టాలను జనం పట్టించుకోలేదు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం జూలై 30న ప్రకటన చేసిన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ‘అనంత’ నడివీధుల్లో పురుడుపోసుకున్న విషయం విదితమే. సమైక్యాంధ్ర ఉద్యమానికి ‘అనంత’ ప్రజానీకం ఇన్నాళ్లూ దిక్చూచీగా నిలుస్తున్నారు. ఇప్పుడూ అదే ఉద్యమస్ఫూర్తితో కదంతొక్కారు. వైఎస్ జగనమోహన్‌రెడ్డిని కలిసి సమైక్య శంఖారావాన్ని దిక్కులు పిక్కటిల్లేలా.. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా పూరిచేందుకు జనం పోటీలు పడి భాగ్యనగరికి తరలివెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టి.. సొంతంగా వాహనాలు సమకూర్చుకుని సమైక్య శంఖారావాన్ని పూరించేందుకు హైదరాబాద్‌కు పోటెత్తారు.
స్వచ్ఛందంగా కదలిన జనం..
జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ఎత్తున వాహనాలను సమకూర్చారు. ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వీఆర్ రామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో భారీగా జనం కదలివెళ్లారు.
పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్వీ సోమశేఖరరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు ఇస్మాయిల్, షాకీర్, నేత జక్కుల ఆదిశేషు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంహెచ్ ఇనయతుల్లా, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్తలు బి.తిప్పేస్వామి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ధర్మవరం సమన్వయకర్త తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ నేతృత్వంలో జనం భారీ ఎత్తున సమైక్య శంఖారావం సభకు తరలివెళ్లారు. గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక రైలు, వాహనాల్లో తరలి వెళ్లారు. మడకశిర నియోజకవర్గంలో హనుమంతరాయప్ప, వైటీ ప్రభాకర్‌రెడ్డి, వైసీ గోవర్దనరెడ్డి నేతృత్వంలోనూ భారీ ఎత్తున జనం కదలివెళ్లారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల జేఏసీల నేతృత్వంలో సొంతంగా వాహనాలను సమకూర్చుకుని.. సెలవులు పెట్టి సమైక్య శంఖారావం సభకు తరలివెళ్లారు. అనంతపురం, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు పట్టణాలకు చెందిన ప్రజానీకం సొంతంగా చార్జీలు పెట్టుకుని హైదరాబాద్‌కు వెళ్లి.. సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు.
టీడీపీ బెంబేలు.. కాంగ్రెస్ కలవరపాటు..
అధికార, ప్రధాన విపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు కుట్ర పన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక తెలంగాణపై ఇచ్చిన లేఖ దన్నుతోనే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు వేర్పాటువాదం చేస్తోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌పై ప్రజానీకం మండిపడుతోంది.
ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు స్వేచ్ఛగా ఎక్కడా తిరగలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతలదీ అదే పరిస్థితి. ప్రజాగ్రహం దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి అంగీకరిస్తున్నారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి.. సమైక్య ఉద్యమాన్ని మడమతిప్పకుండా చేస్తోన్న వైఎస్సార్‌సీపీని జనం అక్కున చేర్చుకుంటున్నారు.
తమ మనోభిప్రాయాలను గౌరవించిన వైఎస్సార్‌సీపీ వెంట జనం కదంతొక్కుతున్నారు. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభకు రికార్డు స్థాయిలో జనం తరలివెళ్లారు. ఇది ప్రధాన విపక్షమైన టీడీపీ శ్రేణులను బెంబేలెత్తేలా చేసింది. ప్రజాగ్రహానికి గురైన టీడీపీకి పుట్టగతులుండవని వైఎస్సార్‌సీపీ సమైక్య శంఖారావానికి తరలివెళ్లిన జనాన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుందని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వైఎస్సార్‌సీపీ సమైక్య శంఖారావం సభ బంపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డాయి.
శంఖారావంతో సమరోత్సాహం
Published Sun, Oct 27 2013 3:20 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement