చిలకలూరిపేట,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై మభ్యపెట్టిన సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులపై కోడిగుడ్లు వేస్తున్న ప్రజలు త్వరలో రాళ్లతో కొట్టి బుధ్ధిచెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా జిల్లాలో తొలిసారిగా చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో బుధవారం రాత్రి సమైక్య శంఖారావ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అంబటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జైలు లోపల, బయట కూడా సమైక్య శంఖారావాన్ని పూరించిన ఏకైక నాయకుడు జగన్ మోహనరెడ్డి అని కొనియాడారు. రాష్ట్రం విడిపోకుండా ఉంచాలన్న లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నారన్నారు.
తెలంగాణాలో ఒక నాటకం సీమాంధ్రలో మరో డ్రామా అడుతూ ప్రజల్ని మభ్య పెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడో సారి చిత్తుగా ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకే సమైక్యవాద ముసుగులో విభజనకు కారకులౌతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వైఎస్ జగన్‌మోహనరెడ్డి అన్ని పార్టీల మద్దతు కూడగట్టారని చెప్పారు. ఇప్పటికైనా సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగలకుండా అన్ని పార్టీలు జగన్ ఉద్యమబాటలో పయనించాలని హితవు చెప్పారు. పార్టీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలుగుజాతి సమైక్యంగా ఉండటం కోసం జగన్ చేపట్టిన ఉద్యమానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. 2004 నుంచి 2009 వరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ హయాంలో మర్రి రాజశేఖర్ చేసిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలోనూ జరగలేదన్నారు.
తెలుగుజాతి ఐక్యత కోసమే...
గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జాతి ఐక్యంగా ఉండాలని సమరానికి సిధ్ధమైన జగన్‌కు తెలుగుజాతి యావత్తు మద్దతు పలుకుతుందన్నారు. పొన్నూరు సమస్వయకర్త రావి వెంకటరమణ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు జగన్ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. నరసరావుపేట పార్టీ సమస్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విడిపోవాలని కోరుకునేవారికి కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా, సమైక్యంగా ఉండాలన్న వారికి కొత్తరాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున మాట్లాడుతూ జగన్ జైలు నుంచే సమైక్య రణభేరిని వినిపించారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమస్వయకర్త షేక్ షౌకత్ మాట్లాడుతూ సోనియా తన కుమారుడి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తుందన్నారు.
తాడికొండ సమస్వయకర్త మందపాటి శేషగిరి మాట్లాడుతూ జగన్ పిలుపునకు స్పందించని పార్టీల భవిష్యత్తు అంధకారంగా మారనుందన్నారు. సభకు పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభానీ అధ్యక్షత వహించగా పార్టీ జిల్లా యువజన, ఎస్టీ, మహిళా, బీసీ, సేవాదళ్, విద్యార్థి, ట్రేడ్‌యూనియన్, మైనార్టీ విభాగాలకు చెందిన కన్వీనర్లు కావటి మనోహరనాయుడు, హనుమంతునాయక్, లక్ష్మిరాజ్యం, దేవెళ్ళ రేవతి, కొత్తా చిన్నపరెడ్డి, నర్సిరెడ్డి, అన్నాబత్తుని సదాశివరావు, షేక్ మహబూబ్ తదితరులు ప్రసంగించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ అధికారికంగా పార్టీకి ఫ్యాన్ గుర్తును కేటాయించటం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
చిలకలూరిపేటలో సమైక్య శంఖారావం పూరించిన వైఎస్సార్ సీపీ నాయకులు
Published Thu, Dec 19 2013 4:16 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
Advertisement
Advertisement