సడలని సమైక్య పోరు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం బుధవారం 113వ రోజూ కొనసాగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పటం ఆకారంలో కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. శ్రీకాకుళం జెడ్పీ ఉద్యోగులు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఫ్లెక్సీని దహనం చేశారు. గుంటూరు జిల్లా ఏఎన్‌యూలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఇన్‌కంటాక్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జగ్గయ్యపేటలో విజ్ఞాన్ విద్యార్థులు ‘371డితో విభజన ఢాం’ అనే అక్షరాల క్రమాన్ని ఏర్పాటుచేసి మానవహారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విద్యార్థి జేఏసీ నేతలు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. రచ్చబండ కార్యక్రమానికి రావద్దంటూ వైఎస్సార్‌సీపీ, జేఏసీ నాయకులు తిరుపతి ఎంపీ చింతా మోహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.