కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో సమైక్య సెగ తగిలింది. జిల్లాలోని డోన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం తనిఖీకి వెళ్లిన ఆయన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఒకానొక సందర్భంలో కోట్ల డౌన్, డౌన్ అంటు ఆయన్ని నిలువరించారు. కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్యవాదులు కోట్లను డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనపై గతేడాది జులై 30న కేంద్ర ప్రకటన వెలువడిన వెంటనే పదవికి రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని వారు కోట్లను నిలదీశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎంపీలపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.