రేపే సమరదీక్ష.. | samara deeksha fro tomorrow | Sakshi
Sakshi News home page

రేపే సమరదీక్ష..

Published Tue, Jun 2 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

రేపే సమరదీక్ష..

రేపే సమరదీక్ష..

సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్న రెండురోజుల సమరదీక్షకు పార్టీలోని అన్ని శ్రేణులు కలసి పనిచేస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళగిరి వై-జంక్షన్‌కు సమీపంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న సువిశాలమైన ప్రదేశంలో భూమి చదును చేసే కార్యక్రమం పూర్తికాగా, వేదిక నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

వివిధ జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు, మహిళలు, యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, నాయకులు సమరదీక్షకు రాను ండడంతో అందుకు అనుగుణంగా వేదికపై ఏర్పాట్లు చేస్తున్నారు.  సోమవారం దీక్షాస్థలంలో జరుగుతున్న పనులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే ఆర్కే , మా జీ మంత్రి , పశ్చిమ కృష్ణా పార్టీ అధ్యక్షులు కొలుసు పార్ధసారథి, సీనియర్ నేత సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ ఐటీ విభాగం కన్వీనరు చల్లా మధుసూదనరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కర్నాటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.

 నియోజకవర్గాల్లో సమావేశాలు...
 అదే విధంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏడాది పాలనలోని వైఫల్యాలను వివరించారు. ఐదు ప్రధాన అంశాల్లో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ తెగబడిన విధానాన్ని వివరించారు. ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్సార్ సీపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించాలని, పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వెల్లడి చేయాలని కోరారు.

 గుంటూరు నగరంలో...
 గుంటూరులోని వైన్ డీలర్ల అసోసియేషన్ హాలులో జరిగిన గుంటూరు నగర కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు.

 సత్తెనపల్లిలో...
 సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఇప్పటికే కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి సమరదీక్ష విజయానికి అన్నివర్గాలు కదలిరావడమే కాకుండా బాబు మోసపూరిత విధానాలపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement