
రేపే సమరదీక్ష..
విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు
నియోజకవర్గాల వారీ సమావేశాలు.
సమాయత్తమవుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
వెల్లడికానున్న బాబు మోసపూరిత విధానాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్న రెండురోజుల సమరదీక్షకు పార్టీలోని అన్ని శ్రేణులు కలసి పనిచేస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళగిరి వై-జంక్షన్‌కు సమీపంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న సువిశాలమైన ప్రదేశంలో భూమి చదును చేసే కార్యక్రమం పూర్తికాగా, వేదిక నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు, మహిళలు, యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎమ్మెల్యేలు, నాయకులు సమరదీక్షకు రాను ండడంతో అందుకు అనుగుణంగా వేదికపై ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం దీక్షాస్థలంలో జరుగుతున్న పనులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే ఆర్కే , మా జీ మంత్రి , పశ్చిమ కృష్ణా పార్టీ అధ్యక్షులు కొలుసు పార్ధసారథి, సీనియర్ నేత సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ ఐటీ విభాగం కన్వీనరు చల్లా మధుసూదనరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కర్నాటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.
నియోజకవర్గాల్లో సమావేశాలు...
అదే విధంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏడాది పాలనలోని వైఫల్యాలను వివరించారు. ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్సార్ సీపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.