‘కోడెల’ రాజీనామా చేయాలి
జగ్గయ్యపేట అర్బన్ : గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనడానికి వస్తున్న వైఎస్సార్ సీపీ శాసనసభ్యుడు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నేతలపై టీడీపీ గూండాలు దాడిచేయడం హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతోపాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులపై తెలుగుదేశం గూండాలు తెగబడి వాహనాన్ని అడ్డగించి దౌర్జన్యంగా, అక్రమంగా భయానక వాతావరణం సృష్టించి, రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టడం దారుణమన్నారు.
ఇది తెలుగుదేశం పార్టీ నిరంకుశ వైఖరి, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన స్థాయిని మరిచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో ఫోన్‌లో సంప్రదింపులు జరపడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని దాడులకు పాల్పడిన వారిపై హత్యానేరం, కిడ్నాప్ కేసులు నమోదుచేయాలని కోరారు.
ఇదే తీరులో తెలుగుదేశం శ్రేణులు 15 రోజులుగా ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన రెండు రోజులకే ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. టీడీపీ దాడులను ఆపకపోతే వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు దిగుతాయని ఉదయభాను హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జగదీష్, నంబూరి రవి, పారిశ్రామికవేత్త తుమ్మేపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీ నేతల ఖండన..
వాహనంలో వెళ్తున్న గుంటూరు శాసనసభ్యుడు ముస్తఫా, ఆయన కుటుంబసభ్యులు, మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేయడంపై వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ మదార్‌సాహెబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.డి.అక్బర్, మైనార్టీ నాయకులు పి.ఫిరోజ్‌ఖాన్ తదితరులు తీవ్రంగా ఖండించారు.