రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ‘సాక్షి’ విలేకరిపై దాడికి యత్నం
Published Sat, Aug 31 2013 3:31 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : యథేచ్చగా సాగుతున్న ఇసుక దోపిడీని బయటపెట్టడమే నేరమైంది. అధికారులను భయపెట్టో, కళ్లుగప్పో ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్న వైనాన్ని సాక్షి ప్రచురించడం వారికి కంటగింపుగా మారింది. ‘ఇసుక నుంచి రూ. లక్షలు’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ టాబ్లాయిడ్‌లో కథనం రావడంతో జిల్లా ఇన్‌చార్జి అదనపు జాయింట్ కలెక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సేనాపతి ఢిల్లీరావు శుక్రవారం రామచంద్రాపురం వచ్చారు. ఇసుక తరలింపుపై విచారణ ప్రారంభించారు. ఢిల్లీరావు అక్కడ వుండగానే లారీలోనూ, ట్రాక్టర్లలోనూ ఇసుక తరలించడాన్ని గమనించి అడ్డుకుని, వాహనాలను సీజ్ చేశారు. వారి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
కానూరు కరణం క్వారీ నుంచి ఇసుక తీసుకువస్తున్నామని, ఎన్ని ఎకరాల్లో ఇసుక తీశారని అడగ్గా, 20 ఎకరాల విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలు జరిగివుండవచ్చని వారు అదనపు జేసీకి చెప్పారు. ఈ సందర్భంగా మాఫియాపై ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ సాక్షి విలేకరి అదనపు జేసీని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా కొందరు అనుచరులను విలేకరిపై ఉసి గొల్పింది.
అదనపు జేసీ సాక్షిగా వారు దౌర్జన్యానికి దిగారు. వార్తలు రాసి మా ఆదాయానికి గండి కొడుతున్నావ్ అంటూ విలేకరిపై దాడికి యత్నించారు. అదనపు జేసీ వారిని గట్టిగా హెచ్చరించడం, తోటి విలేకరులు సైతం గట్టిగా నిలబడడంతో వారు హెచ్చరికలతో సరిపెట్టారు. దొరక్కపోవు... నీ అంతు చూస్తాం... అంటూ 20 మందికి పైగా మాఫియా అనుచరులు విలేకరిపై విరుచుకుపడటం, ఇక్కడకు ఎవడు రమ్మాన్నాడంటూ ప్రభుత్వ అధికారి అయిన ఢిల్లీరావుని కూడా నిలదీయడం ఇసుక మాఫియా బెదిరింపులకు పరాకాష్టగా నిలిచింది.
Advertisement
Advertisement