కైలాసగిరి కొండ ప్రాంతంలో నిరంతరాయంగా సాగుతున్న మట్టి తవ్వకాలు
కంచే చేను మేస్తే.. అన్న చందంగా అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఎక్కడైనా ఖాళీగా భూమి కనిపించిందంటే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు. అక్కడి మట్టి, గ్రావెల్ తవ్వకాలను సాగిస్తున్నారు. ఈ తంతు ప్రజా ప్రతినిధి కనుసన్నుల్లో జరుగుతుండటంతో, ఆ పరిసర ప్రాంతాల్లో అధికార యంత్రాంగం కానరావటం లేదు.
పేరేచర్ల (తాడికొండ) : కైలాసగిరి కొండ ప్రాంతంలో 4 నెలలుగా గ్రావెల్ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అలాగే, ఇటీవల పాలడుగు గ్రామంలో నీరు – చెట్టు పేరుతో చెరువులో నాయకులు మట్టి తవ్వకాలు సాగించారు. అధికార పార్టీ నాయకుల దాహానికి కొండలు, పచ్చని భూములు, బీడు భూములు అగాధాలుగా మారుతున్నాయి.
అధికారం మాటున అక్రమ తవ్వకాలు
స్థానిక కైలాసగిరి ప్రాంతంలో సర్వే నంబర్ 573లో 7.28 ఎకరాల కుంట పోరంబోకు స్థలంలో గతంలో మిలటరీకి చెందిన వారికి, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు, పంటలు వేసుకోవటానికి భూమి ఇచ్చింది. అయితే, అక్కడి మట్టికి మంచి ధర (టిప్పర్ రూ.1500) పలుకుతుండటంతో దానిపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. అంతే రంగంలోకి దిగారు. ఇదంతా ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో జరుగుతుండటంతో నాయకులు, తవ్వకాలకు పాల్పడే వారు భూమి తాలూకు వారిని బెదిరించసాగారు. వారు నిరు పేదలు కావడంతో నాయకుల దెబ్బకు భయపడి పోయారు. న్యాయం కోసం పలు చోట్ల తిరిగారు. ఒకానొక దశలో పేరేచర్ల అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయించారు. వారు అక్కడకు వెళ్లి ప్రజా ప్రతినిధి చొరవతో జరుగుతుందని తెలుసుకొని జారుకున్నారు. ఆ తర్వాత ఎవరి వాటాలు వారికి అందాయి. దీంతో గత నాలుగు నెలలకు పైగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దాదాపు 40 అడుగులకు పైగా లోతు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
ఔటర్ రింగు రోడ్డుకు చేరువలోనే..
ఇక్కడే ఔటర్ రింగు రోడ్డుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ రోడ్డు కూడా మట్టి తవ్వకాలు జరిగే ప్రదేశానికి అతి చేరువలోనే వెళుతుందని తెలుస్తోంది. పైగా ప్రభుత్వ అనుమతులిచ్చిన ప్లాట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. దీనికి తోడు పక్కనే మహిమ గల కైలాసగిరి క్షేత్రం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తారా లేదా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు.
నీరు – చెట్టు మాటున..
అధికార పార్టీ నాయకులు సమర్థించుకుంటూ మట్టి అక్రమ తవ్వకాలకు నీరు – చెట్టు అనే పేరు పెట్టారు. అయితే, నీరు – చెట్టు కార్యక్రమం గ్రామాలలో చేస్తారుగానీ, కొండ ప్రాంతాల్లో చేపట్టరు గదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పేదల భూములను నాశనం చేస్తున్నారు
ప్రభుత్వం మిలటరీ, పేదలకు ఇచ్చిన భూములను ప్రజా ప్రతినిధి నాశనం చేస్తున్నారు. డబ్బుల కోసం అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకోవటం లేదు. ఒక్కోసారి బెదిరింపులకు కూడా దిగుతున్నారు. – పాములపాటి కృష్ణారావు, పేరేచర్ల
Comments
Please login to add a commentAdd a comment