దోమకొండ,న్యూస్‌లైన్ :
మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాతో పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అర్ధరాత్రి వేళల్లో, తెల్లవారుజామున అతివేగంగా ట్రాక్టర్‌లలో ఇసుకను తరలిస్తుండడంతో మండలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై బాధిత కుటుంబాల వారు పోలీస్‌స్టేషన్‌ల వద్ద ధర్నాలు చేసి ఆందోళన నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. గత జూన్‌లో మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన యువకుడు నక్కరాజు పనుల నిమిత్తం జనగామ వచ్చి తిరిగి వెళుతుండగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అదే సంఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడు. కాగా నక్కరాజు శవంతో గ్రామస్తులు బీబీపేటలోని పోలీస్‌స్టేషన్‌లో దాదాపు నాలుగు గంటలు ధర్నా చేయగా కామారెడ్డి రూరల్ సీఐ హరికుమార్ వచ్చి వారిని సముదాయించారు.
అదే విధంగా జనగామ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం సీతారాంపల్లిలో రెండు నెలల క్రితం వీఆర్‌ఏ మల్లేషం ఉదయం 5గంటలకు స్వగ్రామం నుంచి జనగామకు విధుల కోసం సైకిల్‌పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున అంచనూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆ వృద్ధుడికి వెంటనే దోమకొండలోని ఆస్పత్రిలో చికిత్సలు చేయించి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇంత వరకు దానికి కారకులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇసుక మాఫియా ఆగడాలు మితిమిరాయి. రెవెన్యూ అధికారుల అండ, పోలీసుల సహకారంతో వారు విచ్చలవిడిగా ఇసుక దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళల్లో ఇసుకను కామారెడ్డితో పాటు హైదరాబాద్ లాంటి పట్టణాలకు లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తుజాల్‌పూర్ గ్రామం జిల్లా సరిహద్దులో ఉండటం ఇసుక మాఫియాకు కలిసి వచ్చింది.
మెదక్ జిల్లా నస్కల్, రాంపూర్‌ల మీదుగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకొని ఇసుక మాఫియా అంతుచూడాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో ఆకస్మిక దాడులు చేసి ఇసుక డంపులను సీజ్ చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రాణాలు తీస్తున్న ఇసుక తరలింపు
Published Fri, Sep 20 2013 2:38 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement