తాండూరు/యాలాల, న్యూస్‌లైన్: ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో సహజ సంపదను అక్రమార్కులు ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు. యాలాల మండలంలో కాగ్నా నది (వాగు) కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అడ్డుకోవడంలో రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెండు శాఖల్లోని కొందరు అధికారుల దన్నుతోనే ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆయా శాఖల్లోని అధికారులకు రోజు, నెలవారీ మామూళ్లను అందజేస్తూ అక్రమార్కులు ఇసుక దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగ్నా నది నుంచి రోజుకు సుమారు 100-150 ట్రాక్టర్లు, 40లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్కులు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణలో ఫలితం లేకుండాపోతోంది. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు ‘మామూళ్ల మత్తు’లో మొక్కుబడిగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ ఇసుక దందా తీరు...
ఒక ట్రాక్టర్ ఇసుకకు మార్కెట్‌లో సుమారు రూ.2వేల ధర చొప్పున రోజుకు రూ.3లక్షలు, నెలకు రూ.90లక్షల విలువ చేసే ఇసుక రవాణాతో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారని తెలుస్తోంది. వికారాబాద్, పరిగి, మన్నెగుడకు చెందిన లారీలు వచ్చి కాగ్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఒక లారీకి రూ.5వేల చొప్పున రోజుకు రూ.2లక్షలు, నెలకు రూ.60లక్షల ఇసుక లారీల్లో అక్రమంగా తరలిపోతున్నట్టు అంచనా. ఈ మేరకు మొత్తం దాదాపు నెలకు రూ.1.50కోట్ల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోన్నట్టు తెలుస్తోంది.
మామూళ్లు ఇలా...
ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఆయా శాఖల్లోని కొందరు అధికారులకు అక్రమార్కులు రోజు, నెలవారీ వాటాలు అందజేస్తున్నారని సమాచారం. రోజుకు ఒక ట్రాక్టర్‌కు సుమారు రూ.వెయ్యి చొప్పున కొందరు కింది స్థాయి అధికారులకు వాటాలు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక ‘పెద్ద’ అధికారులకు నెలకు రూ.2వేల వరకు మామూళ్లను అక్రమార్కులు అందిస్తున్నారని సమాచారం. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలకూ రోజుకు రూ.2-రూ.3వేలు ముట్టజెబుతూ అక్రమార్కులు రాత్రింబవళ్లు ఈ దందాను నిర్భయంగా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
నిబంధనలు గాలికి...
పట్టా భూముల్లోనుంచి ఇసుక తరలింపునకు సంబంధించి ప్రభుత్వం విధించిన నిబంధనలను అక్రమార్కులు గాలికి వదిలేస్తున్నారు. అటు అధికారులూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఇసుక తరలించే తేదీ, సమయం, ట్రాక్టర్ నంబర్, డ్రైవర్ లెసైన్స్ వివరాలన్నీ తప్పనిసరిగా అధికారులకు ఇవ్వాలి. కానీ ఇవేవీ లేకుండానే కొందరు ఇసుకను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయానికి గండి పడుతోంది. ఒక రాయల్టీ మీద ఒక ట్రిప్పు ట్రాక్టర్ ఇసుకను తరలించాలి. కానీ ఐదారు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పట్టాభూముల్లో ఇసుక తరలించాలనే నిబంధన ఉన్నా అమలు చేయడంపై అధికారులు ధ్యాస పెట్టకపోవడం విడ్డూరం.
రహస్య ప్రదేశాల్లో డంపింగ్... రవాణా
వికారాబాద్, మహబూబ్‌నగర్, కర్ణాటక, దువ్వచర్ల, కొత్తూర్‌లకు యాలాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అడ్డుకట్ట వేయడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఇక కొందరు అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా ఎడ్లబండ్లపై ఇసుకను తరలించి రహస్య ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.
మొక్కుబడి చర్యలు
ఆయా శాఖల్లోని అధికారులకు ట్రాక్టర్‌కు నెలకు రూ.2వేల చొప్పున అక్రమార్కులు రూ.లక్షల్లో వాటాలు అందజేస్తున్నారని తెలుస్తోంది. సబ్‌కలెక్టర్ ఆదేశించినప్పుడు మాత్రం అధికారులు రెండు మూడు రోజులు కాస్తా హడావుడి చేసి ఒకటెండ్రు కేసులు, జరిమానాలతో మమ అనిపించేస్తుండటం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చినా ‘అలాగా...ఎక్కడ’... పై అధికారులకు చెబుతామంటూ తప్పించుకుంటున్నారే తప్ప సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ లోపాయికారీ వ్యవహారాలకు చెక్ పెడితేనే కొంతమేరకైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
వాటాల పర్వం...
Published Sat, Nov 16 2013 12:37 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement