ఇసుకను దోచేస్తున్నారు: సోమువీర్రాజు
ఎమ్మిగనూరు(కర్నూలు జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై బీజేపీ నేత విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి యధేచ్చగా ఇసుక దోపిడీ సాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార బలంతో నేతలు జేసీబీలతో అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారని అన్నారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో బూత్ కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేత గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిమెంట్ యాజమాన్యాల పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. సిమెంట్ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోనే సిమెంట్ బస్తా ధర అధికంగా ఉందని ఈ విషయం లో సీఎం కమిటీ వేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. ముఖ్యమంత్రి కమిటీని పక్కన పెట్టి, నేరుగా సిమెంట్ యాజమాన్యాలతో చర్చించాలని సూచించారు.