⇒ ర్యాంపు నిర్వహిస్తున్న మహిళలకు రోజుకు రూ.200 చెల్లింపు
⇒ ప్రభుత్వ వైఖరితో ఖంగుతిన్న ఆడపడుచులు
⇒ లాభాలు పంచుతామని చెప్పి కూలీలుగా చేశారని ఆవేదన
కొవ్వూరు రూరల్ : ‘డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తా.. అందులో భాగంగా ఇసుక ర్యాంపులను వారికే కేటాయిస్తామంటూ’ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ర్యాంపుల కేటాయింపు వరకు బాగానే ఉన్నా.. వాటిని నిర్వహిస్తున్న మహిళలను మాత్రం దినసరి కూలీలను చేశారు. దీంతో వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇసుక అమ్మకాల్లో 25 శాతం లాభాన్ని స్థానిక డ్వాక్రా సంఘాలకు అందిస్తామని ప్రభుత్వం ఆయా సంఘాలకు హామీ ఇచ్చింది. దీంతో ర్యాంపులు నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా వారికి ఇప్పుడు రోజు కూలి రూ.200 చొప్పున చెల్లిస్తుండడంతో ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు.
రెండు నెలలకు 30 రోజులకే జీతాలు చెల్లింపు
జిల్లాలో మొట్టమొదటిగా కొవ్వూరు మండలం వాడపల్లిలో ఈ ఏడాది అక్టోబర్ 10న ఇసుక ర్యాంపును ప్రారంభించారు. 6 గ్రామ సంఘాలు ర్యాంపు నిర్వహణను చేపట్టాయి. 14 మంది మహిళలు ర్యాంపు నిర్వహణ విధులను నిర్వర్తిస్తున్నారు. ఒక్కో రోజు 6 నుంచి 14 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు రెండు నెలల 15 రోజులు వారు పనిచేశారు. రెండు రోజుల కిందట ర్యాంపు నిర్వహణ పనిలో పాల్గొన్న ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 30 రోజులకు రూ.51 వేలను చెల్లించారు.
దీంతో వారంతా అవాక్కయ్యారు. కూలి కింద తమను లెక్కగట్టి ఇవ్వడంపై వారు మండిపడ్డారు. లాభాల్లో వాటా ఇస్తామంటే నిర్వహణను చేపట్టామని, దీంతో శ్రమ ఎక్కువైనా భరించామని తీరా ఇప్పుడు దినసరి కూలీల కింద లెక్కకట్టి ఇవ్వడం దారుణమని వాపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఇది ప్రస్తుతం అడ్వాన్స్‌గా ఇచ్చామని చెప్పారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే చెల్లించినట్టు సమాచారం. లాభాల పంపకాలపై ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు లేవని అధికారులే చెబుతున్నారు.
5 శాతమే గ్రామ సంఘాలకు
గ్రామ సంఘాలకు 25 శాతం చెల్లిస్తానన్న ప్రభుత్వం 5 శాతాన్ని మాత్రమే చెల్లించనున్నట్టు సమాచారం. మిగిలిన 20 శాతం రాష్ట్ర మహిళా సాధికార సంస్థకు బదలాయిస్తామని పేర్కొనడంతో డ్వాక్రా మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఐదు శాతం నుంచే ర్యాంపును నిర్వహించిన మహిళలకు రోజుకి రూ.200 చొప్పున చెల్లించినట్టు సమాచారం.
లక్షాధికారులన్నారు.. కూలీలను చేశారు
Published Sat, Dec 27 2014 4:18 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement