ఏ తీరమైనా దుమారమే | Sand Reach Strand scandals in Rajahmundry | Sakshi
Sakshi News home page

ఏ తీరమైనా దుమారమే

Published Wed, Oct 29 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

ఏ తీరమైనా దుమారమే

ఏ తీరమైనా దుమారమే

 సాక్షి, రాజమండ్రి : జిల్లాలో డ్వాక్రా సంఘాలకు అప్పగించిన ఇసుక రీచ్‌లు వివాదాలకు కేంద్రాలవుతున్నాయి. అక్కడ విధివిధానాలకు రేణువంత తావు లేకుండా పోయింది. అమ్మకాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే అక్రమార్కులు పర్మిట్ల ముసుగులో రీచ్‌ల నుంచి ఇసుక తరలించారు. డీడీలు తీసిన గృహ వినియోగదారులకు తొలి రెండు రోజులు లారీ ఇసుక దొరకలేదు. మరికొన్ని చోట్ల డీడీలు లేక పోయినా డబ్బులు వసూలు చేసి సరుకు తరలించారు. రాజమండ్రిలో బినామీలు డీడీలు తె చ్చి తమ లారీలు క్యూల్లో పెట్టి మరీ లోడ్ చేయించుకున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు తమ మనుషులతో డీడీలు తీయించి సరుకును తరలించేశారు.  జిల్లాలో 27 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. గోదావరిలో పూడిక తీత చేపట్టే పనులకు  పర్యావరణ అనుమతులు అవసర ం లేకపోవడంతో ఏడు రీచ్‌ల్లో ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలను సోమవారం ప్రారంభించింది. కానీ ఈ విధానం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా తయారైంది. ఎక్కడికక్కడ రీచ్‌ల నిర్వహణకు మహిళా సొసైటీల ఎంపిక అసమ్మతికి దారి తీసింది. టీడీపీ నేతలు తమ వారికి  రీచ్‌లు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తవ్వకాలు జరుగుతున్న చోట వివాదాల ముసుగులో నిబంధనలను గోదావరిలో కలిపేశారు.
 
 ఉల్లితోట సమాఖ్య ధర్నా
 రాజమండ్రి కుమారి టాకీస్ ఎదురుగా, జీవకారుణ్య సంఘం వద్ద ఉన్న రీచ్‌లలో మంగళవారం కూడా వివాదాలు కొనసాగాయి. గత 30 ఏళ్లుగా ఈ రీచ్‌లపై ఆధారపడి జీవిస్తున్న తమకు కాదని కొత్త బోట్ సొసైటీలకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని వెంకటేశ్వరా బోట్స్‌మన్ అసోసియేషన్ వారు జీవకారుణ్య సంఘం వద్ద ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. స్థానికంగా ఉన్న తమను కాదని వేరే డివిజన్ మహిళా సమాఖ్యకు రీచ్‌ను అప్పగించడమేంటని ఉల్లితోట మహిళా సమాఖ్య కుమారి టాకీస్ వద్ద ధర్నాకు దిగింది. దీంతో రెండుచోట్టా మధ్యాహ్నం వరకూ అమ్మకాలు నిలిచిపోయాయి
 
 . ఇక కపిలేశ్వరపురం, కేదారిలంకల్లో రెండు రీచ్‌లలో తవ్వకాలు ప్రారంభం కాలేదు. కానీ పేరు మహిళా సమాఖ్యదైనా పెతన్తం మాత్రం టీడీపీ నేతలు చేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. కేదారిలంక పేరుతో ఏర్పడ్డ శాండ్ మైనింగ్ ఎయిడెడ్ సొసైటీ అధ్యక్షురాలు సాదా పార్వతి గ్రామ టీడీపీ అధ్యక్షుని సోదరి కావడం వివాదాలకు వేదికవుతోంది. మరో తొమ్మిది మంది సభ్యులు కూడా టీడీపీకి చెందిన వారే కావడాన్ని మిగిలిన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తవ్వకాలు రెండు రోజుల్లో ప్రారంభం అవుతాయని భావిస్తుండగా అడ్డుకునేందుకు ఇతర మహిళా సమాఖ్యలు సిద్ధమవుతున్నాయి. సీతానగరం మండలం ముగ్గళ్లలో మహిళా సంఘాలు తవ్వకాలను అడ్డుకున్నాయి. గ్రామంలోని 93 డ్వాక్రా సంఘాలను సంప్రదించకుండా టీడీపీ నాయకులు 12 మందితో రహస్యంగా కమిటీ వేసి రీచ్‌ను అప్పగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొత్తం అన్ని సంఘాల నుంచీ కమిటీని ఎన్నుకుంటే తప్ప తవ్వకాలు సాగనిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తవ్వకాలు నిలిచి పోయాయి.
 
 ఇసుక ట్రాక్టర్లకు ‘దేశం’ జెండాలు
 మామిడికుదురు మండలం పాశర్లపూడి రీచ్‌లో తవ్వకాలను పాశర్లపూడి శాండ్ మైనింగ్ సొసైటీ పేరుతో ఏర్పడ్డ మహిళా సొసైటీకి అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ప్రారంభించిన రీచ్‌లో టీడీపీ వారు ట్రాక్టర్లకు పార్టీ జెండాలు కట్టి హడావిడి చేశారు. తొలిరోజు మొత్తం 26 ట్రాక్టర్ల ఇసుక విక్రయాలు జరగ్గా అందులో 13 ట్రాక్టర్లకు మాత్రమే డీడీలు తీశారు. మిగిలిన వాటికి నిబంధనలకు విరుద్ధంగా రీచ్ వద్దే రూ.2100 చొప్పున వసూలు చేసి లోడ్‌చేశారు. ఇక్కడ ఇసుక తవ్వకాలు తమకే అప్పగించాలంటూ మత్స్యకార సొసైటీలు కూడా మధ్యాహ్నం వరకూ ధర్నా చేశాయి.
 
 రీచ్‌లో రూ.4 వేలు..బయట రూ.9 వేలు
 ఇసుక రీచ్‌లలోకి లారీలకు ప్రవేశం లేదని, ట్రాక్టర్లు, చిన్న వాహనాలను మాత్రమే రవాణాకు అనుమతిస్తామని ప్రభుత్వం చెప్పినా.. రాజమండ్రిలో రవాణాను పూర్తిగా లారీలతో సాగిస్తున్నారు. యూనిట్‌కు రూ.2 వేల చొప్పున రీచ్‌లో చెల్లించిన వారు.. ఒక్కో లారీలోని రెండు యూనిట్ల ఇసుకను బయటకు రాగానే రూ.9 వేలకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఒకే వ్యక్తి బినామీ పేర్లతో డీడీలు తీసి రీచ్‌ల నుంచి బయటికి వెళ్లిన ఇసుకను అమ్ముకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. రాజమండ్రిలో మంగళవారం సుమారు 20 లారీల వరకూ ఇలా అక్రమ విక్రయాలు సాగాయని తెలుస్తోంది. రేవుల్లో ఇసుక తవ్వకాలకు కొత్తగా అనుమతులు పొందిన సొసైటీలు వినియోగిస్తున్న బోట్లకు రిజిస్ట్రేషన్ లేదని తెలుస్తోంది. ఇంకా తమకు ఎవరూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సమర్పించలేదంటున్న అధికారులు నేతల వత్తిడితో వీటి విషయంలో జోక్యం చేసుకునేందుకు జంకుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement