
ఇసుక రీచ్‌ల్లో రక్షణ గార్డులు !
ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల రక్షణార్థం ప్రభుత్వం త్వరలో గార్డులను ఏర్పాటు చేయనుంది. ఐడీ కార్డులు, యూనిఫారం కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ రాయపూడి ఇసుక రీచ్‌ను పరిశీలించి ఈ విషయాలను అక్కడి మహిళలకు స్వయంగా వెల్లడించారు.
తుళ్లూరు: మండలంలోని రాయపూడి ఇసుక రీచ్‌ను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. రీచ్ నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళలతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో రీచ్‌ల్లో చేపడుతున్న ఏర్పాట్లను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు సూచన చేస్తూ రీచ్ వద్దకు వచ్చిన వారెవరైనా నిబంధనలను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు వివరించాలన్నారు. ఇసుక రీచ్‌లో మహిళలకు రక్షణగా గార్డులను ఏర్పాటు చేయబోతున్నట్టు జేసీ తెలిపారు. మరుగుదొడ్లు నిర్మాణాలు, యూనిఫారం, ఐడీ కార్డులు ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే లావాదేవీలు నిర్వహించేలా పలు నెట్ సంస్థలతో చర్చిస్తున్నట్లు వివరించారు.
బ్యాంక్ చలనాలు, డీడీలు తీసుకోవద్దని, మీ-సేవా కేంద్రంలో నగదు చెల్లించిన రశీదులు మాత్రమే తీసుకోవాలని మహిళలకు సూచించారు.
వే బిల్లులను పరిశీలించిన జేసీ అవి లారీ యజమానుల పేరిట ఉండ టంతో అసహనం వ్యక్తం చేశారు. త్వరలో జీపీఆఎర్‌ఎస్ విధానం ద్వారా ఇసుక నాణ్యత, ఎక్కడకు సరఫరా చేస్తున్నది తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
త్వరలో వేబ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లారీ కిరాయి కూడా ఆన్‌లైన్‌లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గతంలో గుంటూరులో లారీ ఇసుక ధర రూ. 14 వేలు ఉండేదని, ఇప్పడు రూ.7 వేలకు లభ్యమవుతుందన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలకు క్యూబిక్ మీటర్‌కు రూ. 40 సెస్ రూపంలో వస్తోందన్నారు.
విజెలెన్స్ అధికారులు కదలనీయలేదు...
రీచ్‌లో ఇబ్బందులను డ్వాక్రా మహిళలు జేసీ శ్రీధర్ దృష్టికి తెచ్చారు. సంపతమ్మ అనే మహిళ మాట్లాడుతూ గురువారం రాత్రి విజిలెన్స్ అధికారు లు తమను రాత్రి 11 గంటల వరకు ఇక్కడ నుంచి కదలనీయలేదన్నారు.
రీచ్‌లో లారీలు, భారీ పడవలు, పొక్లయిన్లను అదుపులోకి తీసుకున్నారని , వాటిని వినియోగించకూడదని హెచ్చరించారని ఆమె జేసీకి వివరించారు.
దీనిపై స్పందించిన జేసీ శ్రీధర్ ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
ఇదిలావుండగా, ఇసుక లేక చర్చి నిర్మాణం నిలిచిపోయిందని బోరు పాలెం గ్రామస్తులు జేసీని కలిసి వివరించారు. దీనిపై తహశీల్దార్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జేసీ వెంట ఆర్డీవో భాస్కర నాయుడు ఇతర అధికారులు ఉన్నారు.
ఇసుక రీచ్, డ్వాక్రా మహిళల రక్షణార్థం, డాక్టర్ చెరుకూరి శ్రీధర్ రాయపూడి,