రాత్రిళ్లు దొంగచాటుగా ఇసుకను తరలిస్తున్న వైనం
పోట్లదుర్తి వంకలో ఇసుక డంప్‌యార్డు ఏర్పాటు
పోట్లదుర్తి(ఎర్రగుంట్ల) : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డగా మారింది. ఇసుక క్వారీని బిస్మిల్లాబాదు గ్రామ సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్వారీ వద్దకు వెళ్లకుండానే పొట్లదుర్తి వంకలో ప్రత్యేక దారిని ఏర్పాటు చేసుకుని పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
అంతేకాకుండా పోట్లదుర్తి వంకలో ఇసుక డంప్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఇసుకను బయటకు తరలిస్తున్నారు. గ్రామంలోని ఏడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. రాత్రిళ్లు పోట్లదుర్తిలో కాపలా ఉన్న పోలీసులకు మాత్రం ఎంతోకొంత ముట్ట చెప్పడంతో వారు కూడా చూసీ చూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి.
కొందరు ఇసుక మాఫియా వ్యక్తులు అధికారులను డాబాలలో కూర్చోబెట్టి మందు.. విందుతో మజా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ వద్ద నుంచి ఇసుక తెచ్చుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఇలా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
పెన్నానదికి నీరు రావడంతో ఇసుక అక్రమరవాణాదారులు పోట్లదుర్తి వంకలో నుంచి ప్రొద్దుటూరు మండలం నంగనూరు పల్లి గ్రామం వద్ద కలిసే విధంగా దారి ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దారులు ఏర్పాటు చేయడంతో పొలాలలో వేసిన పంటలు దెబ్బతింటున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణా కేరాఫ్ పోట్లదుర్తి
Published Wed, May 13 2015 2:53 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement