అధికారుల కళ్లల్లో ఇసుక..!
మంత్రాలయం : చెంతనే బోలెడంత ఇసుక. సొమ్ము చేసుకుంటే తప్పేంటి అనుకున్నారేమో.. నిబంధనలు ‘తుంగ’లో తొక్కారు. ట్రిప్పుల కొద్దీ ఇసుకను పోగు చేసి దర్జాగా నిర్మాణం కానిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఓ కాంట్రాక్టర్ చేస్తున్న ఇసుక దందా ఇది..
మంత్రాలయం మండలం బూదూరు గ్రామ రైతులు సౌకర్యార్థం ప్రభుత్వం రూ.9 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. టెండరు దక్కించుకున్న విజయవాడ కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా శ్రీమఠం సంస్కృత గురుకులకు ఎదురుగా తుంగభద్ర నదిని ఆనుకుని పంపుహౌస్, కొంతమేర పైపులైన్ నిర్మాణానికి గోతులు తవ్వారు. ఏడాదిలో పూర్తి చేయాలన్న నిబంధనతో పనులు వేగంగా చేస్తున్నారు. అయితే పంపుహౌస్ నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం కాంట్రాక్టర్.. ఇసుక దందాకు తెరతీశారు. పంపుహౌస్ నిర్మాణానికి తుంగభద్ర నది ఇసుకను తోడేస్తున్నారు.
వందల క్యూబిక్ మీటర్లు ఇసుకను తోడేస్తుండడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ఇప్పటికే లక్షల రూపాయల విలువజేసే ఇసుకను అనధికారికంగా వాడుకున్నారు. అయినా అధికారులు స్పందించడం లేదు. మంత్రాలయం మండలం కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. రాయచూరు మార్గంలో వెళ్లేవారికి ఈ పనులు కనిపిస్తాయి. అధికారులు ఒకటికి రెండుసార్లు మార్గంలో వెళ్తున్నా ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు.
మాకు తెలియదు: మద్దిలేటి, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్
కాంట్రాక్టర్ ఎలాంటి ఇసుక కొనుగోలు జరగలేదు. ఇసుకను ఎలా తెచ్చుకుంటున్నారో మాకు తెలియదు. ఇసుక అక్రమ వినియోగాన్ని రెవెన్యూ అధికారులు చూసుకుంటారు.