ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ బోల్తా
ఒకరి పరిస్థితి విషమం
మరో ఇద్దరికి గాయాలు
కేసు నమోదు చేయని పోలీసులు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు.. పట్టణం నలుమూలల నుంచి ప్రతి రోజూ పెన్నానదిలోని ఇసుక తరలిపోతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలించే క్రమంలో సోమవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో బొల్లవరానికి చెందిన గండికోట నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా గోపిరెడ్డి బుజ్జిరెడ్డి, పోతురాజు ఏసులకు స్వల్ప గాయాలయ్యాయి. పొట్టిపాడు రోడ్డులోని సింగం పంక్షన్ హాల్ సమీపంలో బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి ఇటుకల ఫ్యాక్టరీ ఉంది.
అతని ట్రాక్టర్‌తో ఇటుకల ఫ్యాక్టరీకే గాక భవన నిర్మాణాలకు కూడా ఇసుకను తరలిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయాన్నే బ్రహ్మానందరెడ్డికి చెందిన ట్రాక్టర్‌ను కృష్ణారెడ్డి తీసుకొని వెళ్లాడు. అతనితో పాటు ట్రాక్టర్‌లో గండికోట నాగరాజు, గోపిరెడ్డి బుజ్జిరెడ్డి, పోతురాజు ఏసురత్నంలు ఇసుకను నింపుకోవడానికి రామాపురం సమీపంలో ఉన్న పెన్నానదిలోకి వెళ్లారు.
వేగంగా వెళ్తుండగా బోల్తా పడ్డ ట్రాక్టర్..
పెన్నానదిలో ఇసుకను నింపుకున్న ట్రాక్టర్ బొల్లవరం గుండా బయలుదేరింది. గండికోట నాగరాజు డ్రైవర్ పక్కనే కూర్చొని ఉండగా బుజ్జిరెడ్డి, ఏసురత్నం ట్రాలీలోకూర్చున్నారు. బొల్లవరం దాటిన తర్వాత మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో నాగరాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాలీలో కూర్చున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ట్రాక్టర్ బోల్తా పడగానే డ్రైవర్ పరారయ్యాడు. గాయ పడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తరలించారు.
కేసు నమోదు చేయని పోలీసులు
ఏదైనా సంఘటన జరిగితే ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసే పోలీసులు ఈ సంఘటనను పట్టించుకోలేదు. సంఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ట్రాక్టర్ యజమాని కూడా అక్కడే ఉన్నారు. అయితే ఎక్కడి నుంచో ఫోన్‌లు రావడంతో పోలీసులు కేసు సంగతే పక్కన పెట్టారు. అంతేగాక ట్రాఫిక్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఆస్పత్రికి చేరుకుని గాయపడిన నాగరాజును పరిశీలించారు. ఇంత హడావవిడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయమై ట్రాఫిక్ ఏఎస్‌ఐ నరసయ్యను వివరణ కోరగా రోడ్డు ప్రమాదం సంఘటనపై ఫిర్యాదు అందలేదన్నారు. అంతేగాక ఆస్పత్రి నుంచి కూడా సమాచారం అందలేదన్నారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది
Published Tue, Dec 2 2014 2:35 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement