రెచ్చిపోయిన ఇసుక మాఫియా..!
కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం డివిజన్ పరిధిలోని టేకులపల్లి మండలం కొండగులబోడు వద్ద ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అటవీశాఖ సిబ్బంది జీపును ట్రాక్టర్‌తో ఢీకొట్టించారు. ఈ ఘటనలో జీపు బోల్తా పడనగా అందులో ఉన్న ఐదుగురు సి బ్బంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పిం చుకున్నారు.శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
కొండగులబోడు గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు ఫారెస్ట్ సిబ్బంది డీఆర్వో కిరణ్‌కుమార్, టీ. నరేష్, సెక్షన్ ఆఫీసర్ క్రాంతికుమార్, మహిళా సిబ్బంది విజయలక్ష్మి, అనితలు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ చీమల అబ్బయ్య వారి జీపును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జీపు బోల్తాపడగా సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీంతో ట్రాక్టర్‌ను డివిజన్ ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. డ్రైవర్ చీమల అబ్బయ్యను సైతం అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం అడిషనల్ చార్జ్ డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా అడ్డుకోబోయిన తమ సిబ్బంది జీపును ట్రాక్టర్ డ్రైవర్ చీమల అబ్బయ్య ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపబోయాడని, ఈ మేరకు అతనిపై, ట్రాక్టర్ యజమాని దళపతి శ్రీనివాసరావుపై హత్యాయత్నం కేసుతో పాటు అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోద చేస్తామని తెలిపారు.
ఈనెల 19వ తేదీన టేకులపల్లి మండలం దళపతి శ్రీనివాస్‌రావుకు చెందిన ట్రాక్టర్ ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నామని, దీంతో అతను అటవీశాఖ అధికారులపై ఎస్సీ కేసు నమోదు చేశారని, మళ్లీ శుక్రవారం అదే ట్రాక్టర్‌తో ఇసుక రవాణా చేస్తుంటే అటవీశాఖ సిబ్బంది పట్టుకునేందుకు వెళ్లగా ట్రాక్టర్ తో చంపబోయాడని తెలిపారు. దీని వెనుక ఉన్న ఇసుకమాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ విషయం కలెక్టర్ ఇలంబరితి, ఎస్పీ షానవాజ్‌ఖాసీంల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. డీఎఫ్‌ఓ వెంట ఏసీఎఫ్ నర్సింహారెడ్డి, ఫారెస్టు సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ సంఘటనకు జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ అసోసియేషన్, ఫారెస్టు అధికారుల అసోసియేషన్, ఎఎస్‌ఎఫ్ ఆఫీసర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు.