చెక్‌పోస్టు సిబ్బంది దారి దోపిడీ
► ఇసుక లారీల నుంచి వసూళ్లు
► హైదరాబాద్‌కు రూ.50.. వరంగల్‌కు రూ.30
► ఇవ్వని డ్రైవర్లకు ఇబ్బందులే..
ములుగు : ఏటూరునాగారం ప్రాంతాల్లో నడుస్తున్న ఇసుక క్వారీలు అటవీ చెక్ పోస్టు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఇసుక లారీల నుంచి చెక్ పోస్టు సిబ్బంది దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజూ వచ్చే వందల లారీల నుంచి పెద్దమొత్తంలో జేబులు నింపుకుంటున్నారు. గతంలోనూ ఇదేవిధంగా వసూళ్లకు పాల్పడగా.. ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అప్పుడు ఉన్నతాధికారులు విచారణ చేశారు. సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలడంతో అందుకు కారణమైన ముగ్గురు బీట్ అధికారులకు నోటీసులుజారీచేశారు. అయినా సిబ్బంది తీరులో మా ర్పు రావడం లేదు.
ఏటూరు ఇసుక క్వారీ నుం చి సాయంత్రం 4గంటల తరువాత మాత్రమే జిల్లా కేంద్రం వైపునకు లారీలను అనుమతి ఇస్తున్నారు. ఈ లారీలు ములుగు మండలం జంగాలపల్లికి వచ్చే సాయంత్రం 7గంటలు దాటుతోంది. చీకట్లో ఎవరు పట్టించుకుంటారని అనుకుంటున్నారో ఏమోగాని జంగాలపల్లి చెక్‌పోస్టు సిబ్బంది దర్జాగా వసూళ్ల పర్వం నడిపిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లే లారీల నుంచి రూ.50, జిల్లా కేంద్రానికి వెళ్లే లారీలకు రూ.30 వసూలు చేస్తున్నారు. ఇదేమిటని లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే ‘మాకూ ఖర్చలు ఉంటాయి కదా.. ఎవరు ఇస్తారు. మాతో పాటు పెద్ద సార్లకు ఇం దులో వాటాలు పోతాయి’ అని సమాధానం ఇస్తున్నారని లారీ డ్రైవర్లు తెలిపారు.
రోజుకు రూ.20వేల పైమాటే..
జంగాలపల్లి చెక్‌పోస్టు మీదుగా ప్రతి రోజూ హైదరాబాద్‌కు సుమారు 350, జిల్లా కేంద్రానికి 200 వరకు లారీ లు వెళ్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు వెళ్లే లారీలకు రూ.50, జిల్లా కేంద్రానికి వెళ్లే లారీలకు రూ.30 చొప్పున లెక్కవేస్తే.. రోజుకు సుమారు రూ.20 వేలకు పైగా వసూళ్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డబ్బు ఇవ్వని లారీల నంబర్లను నోట్ చేసుకొని మరోసారి ఇదే దారిలో వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.
కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న లారీలు
ఒక్కో లారీ డ్రైవర్ చెక్‌పోస్టు సిబ్బందికి డబ్బు లు ఇవ్వడానికి లారీని రోడ్డుపైనే ఆపుతున్నాడు. ఇలా ఒక లారీ డ్రైవర్ పని పూర్తి కావడానికి సుమారు ఐదు నిమిషాలు పడుతుంది. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీలు ఆగిపోతున్నాయి. ఇలా చైన్ సిస్టమ్ మాదిరిగా లారీలు సుమారు 2కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఈ సమయంలో ఏటూరునాగారం, భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనదారులు చెక్‌పోస్టు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు.