పందాలకు రూ.10 కోట్లు
పందాలకు రూ.10 కోట్లు
Published Fri, Jan 17 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లాలో పందాలరాయుళ్ల హవా కొనసాగింది. పోలీసులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కోడిపందాలను కొనసాగించారు. రెండు వారాలుగా పోలీసులు కోడిపందాలపై నిఘా వేసినా జోరుమాత్రం తగ్గలేదు. గత ఏడాది రూ.5 కోట్లవరకు బెట్టింగ్ జరగ్గా ఈ ఏడాది సుమారు రూ.10 కోట్లకు పైగా పందాలు సాగాయని పందాలరాయుళ్లు చెబుతున్నారు. కురుపాం, ఎస్.కోట, నెల్లిమర్ల, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో కోడిపందాలు ఎక్కువగా జరిగాయి. ఎన్నడూ లేని విధంగా కోడిపందాల బెట్టింగ్‌లకు ఇతర జిల్లాల నుంచి వచ్చారు. దీంతో బెట్టింగ్‌లు రెండింతలు పెరిగాయి. కోడిపందాల బెట్టింగ్‌లో ఒకటికి... రెండు, రెండుకు... మూడు, మూడుకు నాలుగు ఇలా బెట్టింగ్‌లు కాశారు. మరో పక్క మరీ ఉత్సాహం ఎక్కువైన వారు రూ.లక్షకు రూ.50,000, లక్షకు రూ.75,000, లక్షకు, లక్ష కాసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగలో ప్రతి మండలంలోని ఏడు ఎనిమిది వరకు తీర్థాలు జరిగాయి. ప్రతి తీర్థంలో కూడా కోడిపందాలు బెట్టింగ్‌లు కొనసాగాయి. ప్రతి సంక్రాంతికి కొన్ని ప్రత్యేక గ్రామాల్లో కేవలం కోడిపందాలు బెట్టింగ్‌లు నిర్వహిస్తారు.
తగ్గిన పొట్టేళ్ల పందాలు..
అయితే పొట్టేళ్ల పందెలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. పొట్టేళ్ల పందాలు చూసేందుకు ఎక్కువగా మంది జనాభా రావడం.. పోలీసులకు వెంటనే సమాచారం వెళ్తుండడంతో నిర్వాహకులు భయపడ్డారు. దీంతో పందేలు కొంత తగ్గుముఖం పట్టాయి.
కొనసాగిన పేకాట
జిల్లా వ్యాప్తంగా పేకాట కూడా భారీ స్థాయిలో కొనసాగింది. పోలీసులు బహిరంగంగా ఆడుతున్న కొంతమందిని పట్టుకుని తర్వాత వదిలేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న రెండు క్లబ్‌లకు పోలీసులు లెసైన్సు ఇవ్వడంపై పలువురు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక స్థలాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసుకుని లక్షల్లో బెట్టింగ్‌లు కాసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో పేకాట జోరుగా సాగింది.
Advertisement
Advertisement