
‘చంద్రన్న కానుక’లతో సంక్రాంతికి పునర్‌వైభవం
ప్రారంభోత్సవ కార్యక్రమంతో మంత్రి పరిటాల సునీత
అనంతపురం సెంట్రల్ : సంక్రాంతి పండుగకు పూర్వవైభవం తీసుకురావడానికే ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. సోమవారం స్థానిక కృష్ణకళామందిరంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరుస కరువు కాటకాలతో సంక్రాంతి పండుగ కళ తప్పుతోందన్నారు. పండుగ చేసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భావించి నిత్యవసర సరుకులు అందజేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు.
సరుకుల పంపిణీలో డీలర్లు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో పెనుకొండ దుర్ఘటన బాధాకరమన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కోటి రూపాయలు, తిరుపతిలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న దృష్ట్యా అదనంగా మరో కోటి, సచివాలయంలో వేడుకలు నిర్వహణకు రూ. 2లక్షలు చొప్పున మొత్తం రూ. 14.02 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.
ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల సమయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ చమన్, నగరపాలక సంస్థ మేయర్ స్వరూప, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఈరన్న, ఉన్నంహనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డెప్యూటీ మేయర్ గంపన్న, ఇన్‌చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం, సివిల్ సప్లై రాష్ట్ర డైరక్టర్ రవిబాబు, జిల్లా మేనేజర్ వెంకటేశం, ఆర్‌డీవో ఉస్సేన్‌సాహేబ్ పాల్గొన్నారు.
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యం : ఎంపీ జేసీ
తాడిపత్రి టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో సోమవారం చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలు పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరుకులను పంపిణీ చేస్తోందన్నారు.
టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. చాగళ్లు రిజర్వాయర్‌కు నీళ్లు తెప్పించేందుకు ప్రత్యేక కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇన్‌చార్జి తహశీల్దార్ రమాదేవి మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో 26,652 మందికి, రూరల్ పరిధిలో 13,637 మందికి సరుకులు పంపిణీ చేయనున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జిలానీబాషా, రెవెన్యూ డీటీ రాజశేఖర్ , డెప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మల్లేసు పాల్గొన్నారు.