
ప్రత్యేకంగా రూపొందించిన సైకిల్.. ఇన్‌సెట్లో నరసింహారెడ్డి
74 నియోజకవర్గాలను కలుపుతూ సైకిల్ సవారీ..
సాక్షి, సత్తెనపల్లి: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థమైన సేవలు అందించే పాలకులను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు సైకిల్ యాత్ర చేయాలని ఓ డాక్టర్ నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం పాలకులు కల్పించిన భ్రమలతో ప్రజలు ఓట్లు వేస్తే ఐదేళ్ల పాటు హామీలు అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపించారన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ సవారీ చేసేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ యేరువ నరసింహరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ సైకిల్ సవారీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల వద్ద ముగియనుంది. 74 నియోజకవర్గాలను కలుపుతూ యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రాధాన్యతను వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనే యోచనతో ఎన్నికల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రాబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు జగన్ సమక్షంలో యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు.