పొదుపు చేస్తేనే వెలుగు | saving power is mandatory | Sakshi
Sakshi News home page

పొదుపు చేస్తేనే వెలుగు

Published Mon, Dec 16 2013 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

saving power is mandatory

 సాక్షి, ఒంగోలు :
 మనిషి జీవనానికి ఆహారం ఎంత అవసరమో.. సౌకర్యవంతంగా జీవించడానికి విద్యుత్ కూడా అంతే. విద్యుత్తే లేని ప్రపంచాన్ని ఊహించలేం. రోజురోజుకూ విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆ స్థాయిలో ఉత్పత్తి లేదన్నది వాస్తవం. భవిష్యత్తరాలకు విద్యుత్ వెలుగులు అందాలంటే..? అందుకు పొదుపే శరణ్యం. మరోవైపు పునరుద్ధరణీయ విద్యుత్ వనరులపై కూడా దృష్టిసారించాలి.  ఆధునిక యుగంలో ఎన్నో రకాల ఆధునాతన గృహోపకరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ విద్యుత్ అవసరం. ఎల్లవేళలా సదుపాయాలు పొందడానికి యథేచ్ఛగా విద్యుత్‌ను వినియోగిస్తుంటాం. దీనివల్ల విద్యుత్ కొరత తలెత్తుతుంది. అందుకే మన వంతు బాధ్యతగా విద్యుత్‌ను పొదుపు చేద్దాం...అదెలా అంటారా...! ఇవిగో సూచనలు.
 
 లైట్లు, ఫ్యాన్లు
  వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలి ఉపయోగించడం మంచిది.
  అవసరం లేనపుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేయాలి.
  ఫిలమెంట్ బల్బులకు బదులు తక్కువ విద్యుత్‌తో నాలుగు రెట్లు అధికసామర్థ్యం, అంతే వెలుగునిచ్చు సీఎఫ్‌ఎల్ బల్బులు ఉపయోగించాలి.
 టీ5 తరహా ట్యూబ్‌లైట్లను వాడాలి.
  బల్బు/ట్యూబ్‌లైట్లను నెలకోసారి శుభ్రపరచాలి.
  ఫ్యాన్లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ అమర్చుకోవాలి.
 ఎల్‌ఈడీ బల్బుల ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చు.
  50 వాట్స్ సీలింగ్ ఫ్యాన్లను వాడండి.
  ఫ్యాన్ బేరింగ్‌లకు ప్రతి సంవత్సరం గ్రీజ్ పెట్టించడం ద్వారా 5 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు.
 రిఫ్రిజిరేటర్
     {ఫిజ్ డోర్ వీలైనన్ని తక్కువసార్లు తెరవండి
  ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను మధ్యస్థంగా సెట్ చేయండి.
  వేడి ప్రదేశాల నుంచి సాధ్యమైనంత దూరంగా పెట్టండి.
  ఫ్రిజ్‌ను గోడకు కనీసం అరడుగు దూరంలో, గాలి బాగా వీచే ప్రదేశంలో ఉంచాలి.
  డిఫ్రాస్టేషన్ రెగ్యులర్‌గా చేసి ఐస్ గడ్డకట్టకుండా చూసుకోవాలి.
  ఫ్రిజ్ డోరుకుండే రబ్బరు సీలింగ్ టైట్‌గా ఉంచుకోవాలి.
 ఫ్రిజ్‌లో చల్లదనం లేకున్నా.. ఎక్కువసార్లు కంప్రెసర్ ఆన్/ఆఫ్ అవుతున్నా.. ఫ్రిజ్ బాడీ బాగా వేడెక్కుతున్నా మెకానిక్‌తో చెక్ చేయించండి.
  వేడి పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టొద్దు.
  ఫ్రిజ్‌ను పడకగదిలో ఉంచొద్దు.
 ఎక్కువ రోజులు ఇంట్లో లేనపుడు ఫ్రిజ్ ఆఫ్ చేయండి.
 గీజర్లు
  అవసరమైనపుడు మాత్రమే గీజర్ ఆన్‌చేయండి.
  థర్మోస్టాట్ సెట్టింగ్‌ను 35-40 డిగ్రీల మధ్య ఉంచండి.
  గీజర్ స్విచ్‌ను బాత్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకుంటే.. వెంటనే ఆఫ్ చేసుకోవడానికి అనుకూలం.
  అపార్టుమెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కమ్యూనిటీ క్లబ్‌లు, క్యాంటీన్లలో విధిగా సోలార్ హీటర్లు ఏర్పాటు చేసుకోవాలి.
  సాధ్యమైనంత వరకు సోలార్ హీటర్‌కే ప్రాధాన్యమివ్వండి.
 వాషింగ్ మెషీన్లు
     వాషింగ్ మెషిన్లో దుస్తులు వేసే ముందు వాటిని బాగా నానబెట్టండి.
 వాషింగ్ మెషీన్లను ఒకటి రెండు జతల కోసం కాకుండా.. ఫుల్ లోడ్ వ ద్ద ఉపయోగించండి.
 తక్కువ టైమర్‌ను సెట్ చేసుకోండి.
  సరైన పాళ్లలో మాత్రమే నీటిని, డిటర్జెంట్‌ను వాడండి.
  రిన్స్ చేయడానికి చల్లని నీరు మాత్రమే వాడాలి.
  వీలైనంత వరకు ఎలక్ట్రిక్ డ్రైయింగ్‌ను వాడొద్దు.
 ఏసీలు
 సాధారణ చల్లదనానికి 24 డిగ్రీలు సెట్ చేసుకోండి. సెట్టింగ్ తగ్గించడం(డిగ్రీలు పెంచడం) వల్ల ప్రతి సెంటీగ్రేడ్‌కు కనీసం 5 శాతం విద్యుత్ ఆదా చేసుకోవచ్చు.
 ఒక సీలింగ్ ఫ్యాన్ ఆన్‌లో ఉంచడం ద్వారా ఏసీని కొంచెం అధిక ఉష్ణోగ్రత వద్ద సెటింగ్ ఉంచొచ్చు.
 ఏసీ ఆన్‌లో ఉన్నపుడు తలుపులు, కిటికీలు మూయాలి. కిటికీలకు సన్‌ఫిల్మ్/ముదురు రంగు కర్టెన్లు వాడండి.
  ఇంటి పైకప్పుపై కూల్‌హోమ్ పెయింట్/రూఫ్‌గార్డెన్ పెంచడం ద్వారా ఏసీపై లోడు తగ్గుతుంది.
  ఏసీకి దగ్గర బల్బులు, టీవీలు ఉంచొద్దు. దీని వల్ల థర్మోస్టాట్ సెట్టింగ్‌పై ప్రభావం ఏర్పడుతుంది.
 ఏసీ యూనిట్‌పై గాలి నిరోధించకుండా చెట్ల నీడను పడేలా చూసుకోండి.
 బయటికి వెళ్లాలనుకునేటపుడు గంట ముందుగానే ఏసీని ఆఫ్ చేయండి.
 ఏసీ రూములో అనవసర వస్తువుల్ని ఉంచొద్దు.
 టీవీలు, కంప్యూటర్లు
  అవసరంలేనపుడు స్విచాఫ్ చేయండి.
  టీవీల రిమోట్ ఆఫ్ చేయడం వల్ల, కంప్యూటర్లు లాగ్ ఆఫ్ చేయడం వల్ల విద్యుత్ వృథా అవుతుంది.
 అవసరంలేనపుడు సెల్‌ఫోన్ చార్జర్లు, దోమల మెషీన్లు ఆఫ్ చేయాలి.
 వంట గది పరికరాలు
  పదార్థాలను ముందుగా నానబెట్టడం ద్వారా మిక్సీ విద్యుత్ వాడకం తగ్గించొచ్చు.
 సాధ్యమైనంత వరకు పొడి పదార్థాల గ్రైండింగ్‌ను నిరోధించండి.
  ఎలక్ట్రిక్ స్టౌలకు బదులు మైక్రోవేవ్ ఓవెన్ వాడకం ద్వారా 50 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు.
  చెక్ చేసేందుకు మైక్రోవేవ్ ఓవెన్ తెరవడం ద్వారా, ప్రతి ఒక్కసారికి 25 డిగ్రీల వేడి వృథా అవుతుంది.
  ఎక్కువ పదార్థాలను ఓవెన్‌లో బేక్ చేయొద్దు.
 ఎలక్ట్రిక్ స్టౌలు వాడేటపుడు నిర్ధారిత సమయానికి ముందే స్టౌను ఆఫ్ చేయండి.
  అడుగు భాగాన సమతలంగా ఉన్న స్టౌల వల్ల వేడి సమర్థవంతంగా వ్యాపించి, విద్యుత్ ఆదా అవుతుంది.
  గ్యాస్ స్టౌలు వాడుతున్నపుడు మంటను నియంత్రించుకుని, నీలి రంగు మంట వచ్చేలా చూసుకోండి. పసుపు రంగు మంట వస్తే బర్నర్ శుభ్రం చేయాలి.
  ప్రెషర్ కుక్కర్, ప్రషర్ ఫ్యాన్లను వాడండి. కుక్కర్ గ్యాస్కెట్, లిడ్స్‌ను సరిగా ఉంచుకోవాలి.
  ఫ్రిజ్ నుంచి బయటికి తీసిన పదార్థాలను వెంటనే స్టౌపై పెట్టకుండా కాసేపు బయటే ఉంచండి.
  బాగా చల్లని పదార్థాలను ఓవెన్‌లో పెట్టొద్దు.
  ఎలక్ట్రిక్ కుక్కర్ కన్నా.. ప్రెషర్‌కుక్కర్ ద్వారా ఇంధనం ఆదాతోపాటు, ఆరోగ్యకరం.
  కీప్‌వార్మ్ అనే స్విచ్‌గల రైస్ కుక్కర్‌వాడకం ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చు.
 వ్యవసాయదారుల పొదుపు చర్యలు
  పంప్‌సెట్‌లకు సరిపడు కెపాసిటర్‌ను వాడండి.
  ఐఎస్‌ఐ మార్కుగల మోటార్ పంప్‌సెట్ల, పైపులను మాత్రమే వాడండి.
  సక్షన్, డెలివరీలలో మెలికలులేని హెచ్‌డీపీఈ/ఆర్‌పీవీసీ పైపులను వాడండి.
 రాపిడిలేని ఫుట్ వాల్వులు వాడండి.
  విధిగా చాలినన్ని కెపాసిటర్లను వాడండి.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement