సాక్షి, కడప: ఇసుక, మైనింగ్, అబ్కారీ ద్వారా వీలైనంత మేర ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా అధికారులు కృషి చేయాలని రాష్ర్ట మంత్రులు కోరారు. శనివారం మధ్యాహ్నం కడప కలెక్టరేట్ సభా భవనంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హోం శాఖమంత్రి చిన్నరాజప్ప, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాతలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇసుక ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఇసుక నాణ్యత ప్రకారమే ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.190 కోట్ల మేర ఆదాయం వస్తోందని తెలియజేశారు. రెవెన్యూ పరంగా ప్రతి అధికారి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కృషి చేయాలన్నారు. పోలీసు సంక్షేమానికి సంబంధించి రూ. 10 కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. అలాగే జిల్లాలో బెల్ట్ షాపులు, కల్తీ మద్యం విక్రయాలపై మంత్రి రవీంద్ర జిల్లా అధికారులపై మండిపడ్డారు. వెంటనే మద్యం షాపుల్లో శ్యాంపిల్స్ తీసి పంపించాలని... బెల్ట్‌షాపులపై కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.
మైనింగ్ మాఫియా ఆట కట్టిస్తాం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో మైనింగ్ మాఫియా ఆటకట్టించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ శాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగంపేటలో జరుగుతున్న బెరైటీస్ అక్రమ తవ్వకాలపై విచారణ చేపట్టాలని కలెక్టర్ కేవీ రమణను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గం సిరిగేపల్లెలో అక్రమ మైనింగ్ జరుగుతుండగా తాను స్వయంగా గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్ నారాయణకు ఫిర్యాదు చేశానన్నారు. అయినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
దీనిపై మంత్రి సుజాత స్పందిస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పల్వరైజింగ్ మిల్లులు మూతపడితే కార్మికులు రోడ్డు పాలు కావాల్సి ఉంటుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రికి సూచించారు. ఇసుకపై ఆమె సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అమ్మకాల ద్వారా రూ. 191 కోట్ల ఆదాయం వస్తుండగా, కడప నుంచి అతి తక్కువగా వస్తోందని వివరించారు. రవాణా చార్జీలు అధికంగా ఉన్నాయి గనుక ఇసుక ధరలను తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని ఆమె వెల్లడించారు.
ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు : మంత్రి కొల్లు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరిగేలా చూడాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ సిబ్బందిని హెచ్చరించారు. బెల్ట్‌షాపులను ఎక్కడికక్కడ తొలగించాలని ఆదేశించారు. బెల్ట్‌షాపుల తొలగింపు, ఎమ్మార్పీ అమలుపై తాము పలు కేసులు నమోదు చేశామంటూ ఎక్సైజ్ అధికారులు వివరించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని కేసులు నమోదు ముఖ్యం కాదని, ప్రభుత్వ ఆదేశాలను విధిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం సంక్షేమంపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు స్కాలర్‌షిప్పులకు అవసరమైన ఆధార్‌సీడింగ్ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.
హాస్టళ్లలో చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. దోబీఘాట్‌లలో కాలిపోయిన మోటార్లను రిపేర్లు చేయిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ, ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ, జేసీ రామారావుతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆదాయం పెంచండి
Published Sun, Feb 8 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement