విశాఖ తీరం సురక్షితం  | Scientists and Environmentalists Comments On Visakhapatnam Coastal | Sakshi
Sakshi News home page

విశాఖ తీరం సురక్షితం 

Published Tue, Jul 21 2020 3:48 AM | Last Updated on Tue, Jul 21 2020 4:22 AM

Scientists and Environmentalists Comments On Visakhapatnam Coastal - Sakshi

ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారత్‌కు ఉన్న సువిశాల సముద్ర తీరం సురక్షిత ప్రాంతం. అందులోనూ కోస్తా తీరం అత్యంత సురక్షితం..  సముద్రాల్లో ఎప్పుడో మిలియన్‌ సంవత్సరాల క్రితం ఏర్పడిన చీలికతో తీర భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లదు

భారతదేశం సంవత్సరానికి 2 సెంటీమీటర్లు చొప్పున ఉత్తరం వైపునకు కదులుతోంది. లక్షల ఏళ్ల తరువాత అంటార్కిటికా నుంచి ఇప్పటికి ఇక్కడ వరకు వచ్చాం. వీటిని దీర్ఘకాలిక మార్పులుగానే అభివర్ణిస్తాం. లాంగ్‌ టెర్మ్‌ టెక్టానిక్స్, డీప్‌ సీ టెక్టానిక్స్‌ అంటారు. రేపో ఎల్లుండో కోస్తా తీర ప్రాంతాల్లో భూకంపాలు, అగ్ని పర్వతలు బద్ధలవుతాయని, సునామీలు వస్తాయని చెప్పడం తప్పు. టెక్టానిక్స్‌ ప్రకారం అసలు ఎన్ని లక్షల సంవత్సరాలకు అవి సంభవిస్తాయో చెప్పలేం.  అసలు వస్తాయో రావో కూడా తెలియని స్థితిలో చేసిన పరిశోధనల్లో ఒక ఫాల్ట్‌ లైన్‌ను మాత్రమే గుర్తించారు.
– సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ) శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు. 

గరికపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎప్పటికైనా విశ్వం అంతరిస్తుందన్న వాదనల్లో ఎంత సత్యం దాగుందో.. సముద్రంలో చీలికల వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళనలో కూడా అంతే వాస్తవం ఉందని పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. కోస్తా తీరానికి భూకంపాల తాకిడి, సునామీల బెడదా లేదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. సాగర గర్భంలో ఏం జరిగింది? తరువాత ఎలా ఉంటుంది? అనే అంశంపై వివిధ రంగాల శాస్త్రవేత్తలు వెల్లడించిన అధ్యయనాలు ఇలా ఉన్నాయి.. 

మనిషి జీవితకాలంతో ముడిపెడితే.. 
అంటార్కిటికా నుంచి ఇండియా, ఇండోనేషియా మొదలైన ప్రాంతాలు విడిపోయినప్పటి నుంచి సముద్ర గర్భంలో టెక్టానిక్స్‌(కదలికలు) ఏర్పడుతున్నాయి. సుమారు 130 మిలియన్‌ ఏళ్ల నుంచి సముద్ర గర్భంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమే తప్ప వీటి వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఇవి సముద్రంలో ఒత్తిడి మూలంగా యాక్టివేట్‌ అవుతుంటాయి. వీటిని మానవ జీవిత కాలంతో ముడిపెట్టి పరిశీలిస్తే లక్షల సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు తూర్పు, పశ్చిమ తీరాల్లో సునామీలు గానీ, భూకంపాలు గానీ ఈ ఫాల్ట్‌ లైన్స్‌(చీలికలు) వల్ల వచ్చే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

తూర్పు, పశ్చిమ కోస్తా తీరాలు సురక్షితం... 
► సునామీల ప్రభావం కోస్తా తీరంపై చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టెక్టానికల్లీ యాక్టివ్‌ జోన్లకు కోస్తా తీర ప్రాంతం లంబం(పార్లల్‌) గా ఉండదు. అండమాన్‌ నికోబార్‌ దీవులు, సుమత్రా దీవి ప్రాంతం మాత్రం టెక్టానికల్‌ జోన్లకు లంబంగా ఉండటం వల్ల అక్కడ భూకంపాలు, సునామీలు ఏర్పడుతుంటాయి.  
► ఇక కోస్తా తీరం ప్రపంచంలోనే భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్న అత్యంత స్థిరమైన ప్రాంతం. తూర్పు కనుమలు లాంటి రాతి నిర్మాణాలు రక్షణ కవచంగా ఉన్నందున భూకంపాలు రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చినా రిక్టర్‌ స్కేల్‌పై 3 కంటే తక్కువ తీవ్రతనే కలిగి ఉంటాయి.   

ఖండాలు విడిపోయినప్పటి చీలిక... 
తీరంలో చీలిక ఏర్పడిందదన్న వార్తలపైనా శాస్త్రవేత్తలు స్పష్టత ఇస్తున్నారు. వాస్తవంగా సునామీలు రావాలంటే సముద్ర గర్భంలోని బ్లాకుల్లో కొన్ని పైకి రావడం గానీ, కిందకు వెళ్లడం గానీ జరగాలి. అండమాన్‌ నికోబార్, జావా తీరంలో జరిగిన సంఘటనలివే.  కోస్తా తీరంలో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించడంలేదు. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ఖండాలు విడిపోయినప్పుడు కృష్ణా గోదావరి బేసిన్‌లో బ్లాకుల కదలిక జరిగిందే తప్ప ఈ మధ్య ఏర్పడిన చీలిక కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

భయపడాల్సిన అవసరం లేదు.. 
మనుషుల కారణంగా సముద్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే దానిపై ఎన్‌ఐవో అధ్యయనం  చేస్తోంది. డేటా ఎనలైజ్‌ చేయడం వరకే శాస్త్రవేత్త పని. ఇదే ఫైనల్‌ అని చెప్పకూడదు. మిలియన్‌ సంవత్సరాల క్రితం చిన్నపాటి చీలిక ఏర్పడిన మాట వాస్తవమే కానీ తీర భద్రతకు ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనేంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పడు ఉత్పన్నమయ్యే సమస్యలేవీ లేవు.    
– జి. ప్రభాకర్‌ ఎస్‌ మూర్తి, సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఐవో చీఫ్‌ సైంటిస్ట్‌    

అది ఖండాలు ఏర్పడిన నాటిది... 
కోస్తా తీరంలో సునామీలకు ఆస్కారం లేదు. సముద్ర గర్భంలో కనిపిస్తున్న చీలిక ఖండాలు ఏర్పడినప్పుడు వచ్చిందే తప్ప ఇటీవల పరిణామాలకు ఏర్పడింది కాదు. కోస్తా తీరానికి గానీ, సముద్ర ప్రాంతాలకు గానీ ముప్పు ఏదైనా ఉందంటే అది కేవలం కోతకు గురవడమే. సముద్రంలో ఏదో జరిగిపోతుందనే భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు.  
 – డా.నాగేశ్వరరావు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జిఎస్‌ఐ) రిటైర్డ్‌ డైరెక్టర్, కోస్తా తీర పరిశోధకుడు

విశాఖపట్నం సేఫ్‌.. 
విశాఖ తీరానికి భద్రత లేదని చెప్పడం సరికాదు. భూకంప కేంద్రాలపై కోస్తా తీరమంతా పరిశోధన చేశాం. పాండిచ్చేరి, ఒంగోలు, విజయనగరంలో నెల్లిమర్ల, కందివలస, నాగావళి ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నట్లు గుర్తించాం. ఇవి వీక్‌ జోన్లు మాత్రమే. భారతదేశం ఉత్తరానికి కదులుతుండడంతో అక్కడ ఒక ఏషియన్‌ ప్లేట్‌ తగులుతుంది కాబట్టి ఏర్పడే ఒత్తిడికి వీక్‌ జోన్స్‌ అన్నీ యాక్టివేట్‌ అయి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా గుజరాత్‌లో బూర్జ్‌లోను, లార్టూరులోను, కొయినా, భద్రచలం, పాండిచేరి, విజయనగరం ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అవి డీప్‌ సీ టెక్టానిక్స్‌ కావు. అన్ని తుఫాన్లు మచిలీపట్నం, బంగ్లాదేశ్‌ వైపు మాత్రమే వస్తుంటాయి. కొండలు ఎక్కువగా ఉండడంతో తుఫాన్ల ప్రభావం విశాఖపై  చాలా తక్కువ.  
 – డా.కేఎస్‌ఆర్‌ మూర్తి, ఎన్‌ఐఓ రిటైర్డ్‌ సెంటిస్ట్‌ 

ముంబై అభివృద్ధి ఆగిందా? 
ప్రపంచంలో అనేక తీర నగరాల మాదిరిగానే ముంబై కూడా 2050 నాటికి పూర్తిగా అరేబియా సముద్రంలో మునిగిపోతుందని న్యూజెర్సీకి చెందిన శాస్త్రవేత్తల స్వతంత్ర సంస్థ క్‌లైమేట్‌ సెంట్రల్‌ దశాబ్దాల క్రితం పేర్కొంది. అలాగని ముంబై అభివృద్ధి ఆగిపోయిందా? 6.5 మిలియన్‌ సంవత్సరాల నుంచి స్తబ్దుగా ఉన్న చీలిక వల్ల ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పడం వంటివన్నీ ఊహాజనితాలే. వేల ఏళ్ల తర్వాత రాబోయే ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఆపలేం కదా.     
    – ఆచార్య కె.విజయ్‌కుమార్, ఏయూ సోషల్‌ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement