రెండో రోజు ప్రశాంతం
Published Wed, Sep 4 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థా నంలో నిర్వహిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ వెబ్‌కౌన్సెలింగ్ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 32 మంది మాత్రమే హాజరయ్యూరు. ఇందులో వ్యవసాయ కోర్సులతోపాటు వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో నోటిఫికేషన్‌లో ఇచ్చినట్లుగా ఉదయం, సాయంత్రం అని చూడకుండా ఎవరూ ముందువస్తే వారిని లోనికి అనుమతించారు.
బుధవారం బీసీ(డి), బీసీ(ఇ), ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులకు ఫార్మర్, నాన్‌ఫార్మర్ కోటా కింద, నోటిఫికేషన్‌లో ఇచ్చిన ర్యాంకుల మేరకు కౌన్సెలింగ్ జరగనుంది. రైతుల కోటాకు లేనిపోని నిబంధనలు..రైతుల కోటాకు వ్యవసాయ విశ్వవిద్యాలయం లేనిపోని నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రైతు కోటా కింద సీట్లు పొందే విద్యార్థులకు తండ్రి లేదా తల్లి లేదా విద్యార్థి పేరు మీద మూడెకరాలకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. దీనికి తోడు నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదవాలనే నిబంధనతో చాలా మంది విద్యార్థులు రైతుల కోటా కిందకు రావడంలేదు.
దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వావాదం జరుగుతోంది. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓ విద్యార్థినికి మూడెకరాలకు పైగా భూమి ఉన్నప్పటికీ ఎస్సెస్సీ వరకు పట్టణ ప్రాంతంలో చదవడంతో రైతుల కోటా వర్తించలేదు. లేనిపోని నిబంధనలు పెట్టి, విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో అందరూ పట్టణ ప్రాంతాల్లోనే చదువుకుంటున్నారని, ఈ నిబంధన మార్చాలని వారు కోరారు. యూనివర్సిటీ నిబంధనల మేరకే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెబ్‌కన్వీనర్ కిషన్ రెడ్డి, కోకన్వీనర్ తిప్పేస్వామి చెప్పారు.
అగ్రిసెట్‌లో 100లోపు ర్యాంకుల వారికి కౌన్సెలింగ్
రెండేళ్ల వ్యవసాయ పాలిటెక్నిక్ చదివి, నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరేందుకు నిర్వహించిన అగ్రి సెట్ ప్రవేశపరీక్షలో 100 లోపు ర్యాంకు సాధించిన వారు ఈ నెల 12న హైదరాబాద్‌లోని హోంసైన్స్ కాలేజీ-సైఫాబాద్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. సీడ్ టెక్నాలజీలో 50 లోపు ర్యాంకు సాధించిన వారు సైతం హాజరుకావచ్చు.
Advertisement