
బంగారుపాళెం పోలీస్ వాహనం
చిత్తూరు, బంగారుపాళెం: స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన కండీషన్ లేని వాహనంతో పోలీసులు అవస్థల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ డొక్కుబండి ఎప్పుడు ఆగిపోతుందో? ఎక్కడ అవస్థలు పడాల్సి వస్తుందోనని దేవుడికో దండం పెట్టి విధులకు బయల్దేరుతున్నారు. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో బంగారుపాళెం పెద్ద మండలం. ఇక్కడ చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి ఉండడంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా మండలంలో 40 గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా గొడవలు, ఇతర సంఘటనలు చోటుచేసుకుంటే హుటాహుటిన వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా బెంగళూరు, తిరుపతి, తిరుమల, చెన్నై తదితర పట్టణాలకు ప్రముఖుల రాకపోకల సమయంలో ఎస్కార్టుగా ఇదే వాహనంలో వెళ్లకతప్పడం లేదు. ఉంటుంది. 2002లో పలమనే రు పోలీసులకు క్వాలిస్ వాహనం ఇచ్చారు. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో దీనిని విరివి గా వినియోగించారు.
ఆ తర్వాత కొత్త వాహనా న్ని వారికి పోలీస్ శాఖ ఇవ్వడంతో ఆ క్వాలిస్‌ను ఐదేళ్ల క్రితం బంగారుపాళెం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చారు. అప్పటికే దీనిని తుక్కు..తుక్కుగా వాడేశారు. చూసేందుకు బాగున్నా సరైన కండీ షన్ లేని ఈ సెకండ్ హ్యాండ్ వాహనంతో అవస్థలు పడుతున్నారు. సెల్ఫ్ మోటర్, రేడియేటర్, బ్యాటరీ మొదలైనవి సక్రమంగా పనిచేయక ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకం. అంతేకాకుండా ప్రమాదాల బారిన పడిన సందర్భాలూ లేకపోలేదు. ఇటీవల జన్మభూమి గ్రామ సభ వద్ద కూడా ఈ వాహనాన్ని రిపేరు చేసు కుంటూ పోలీసులు కనిపించారు. వాస్తవానికి జిల్లాలో కేసుల తాకిడి ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్లలో బంగారుపాళెం ఒకటి. ఇలాంటి పోలీస్ స్టేషన్‌కు కొత్త వాహనాన్ని మంజూరు చేయకపోవడం గమనార్హం! ఇటీవల జిల్లాకు వచ్చిన కొత్త వాహనాలను చిన్నచిన్న స్టేషన్లకు సైతం అందజేశారు. అత్యవసరమైన స్టేషన్లకు పాతకాలం నాటి డొక్కు వాహనాలే ఇప్పటికీ దిక్కయ్యాయి. ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారులు స్పందించి బంగారుపాళెంకు కొత్త పోలీస్ వాహనాన్ని మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. పూతలపట్టు మండలంలో పోలీసులు హైవే పట్రోలింగ్ వాహనంలో వెళ్తూ ప్రమాదానికి గురై, ఒకరు మృతి చెందడం, ఎస్‌ఐతో సహా మరో ముగ్గురు గాయపడడటం విదితమే. డొక్కు వాహనాలతో యమర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే అటువంటి ప్రమాదాల బారిన పడరనే గ్యారంటీ ఏమీ లేదు. పోలీస్ బాసులూ.. వీళ్లనూ కాస్త పట్టించుకోండి సారూ!