నిరవధిక సమ్మె దిశగా సచివాలయ ఉద్యోగులు
ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమాయాత్తమవుతున్నారు. నిరవధిక సమ్మెకు దిగడానికీ వెనకాడకూడదని శనివారం జరిగిన ‘సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం’ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. వారితో కలిసి సమ్మెకు దిగడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో తీర్మానించారు. త్వరలో తేదీలు ఖరారు చేయనున్నారు. కార్యవర్గం భేటీకి ముందు సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి సచివాలయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఎల్-బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. సీమాంధ్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని, యూపీఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, హైదరాబాద్ అందరిదీ అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్-బ్లాక్ నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శన సీ-బ్లాక్ మీదుకు మళ్లీ ఎల్-బ్లాక్‌కు చేరింది. సీమాంధ్ర ఉద్యోగుల నినాదాలతో సచివాలయం హోరెత్తింది. ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, కోచైర్మన్ మురళీమోహన్, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య, కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కోఆర్డినేటర్ రవీంద్ర, వైస్‌చైర్మన్ బెన్సన్, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించారు.