వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రోజురోజుకూ సంఘీభావం పెరుగుతోంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రోజురోజుకూ సంఘీభావం పెరుగుతోంది. సోమవారం సాయంత్రం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆయనను కలిసి దీక్షకు తమ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలను వారు స్వాగతించారు. అలాగే, సమైక్యాంధ్ర లాయర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (లాయర్ల జేఏసీ) సభ్యులు కూడా వైఎస్ జగన్మోహన రెడ్డిని కలిసి ఆయనకు తమ సంఘీభావం తెలిపారు.
కాగా, మూడు రోజుల నుంచి సమైక్య దీక్ష చేస్తున్న జగన్మోహన రెడ్డికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. ఆయన కాస్త నీరసించినట్లు గుర్తించారు. జగన్ రక్తంలోని మధుమేహం స్థాయి 68కి పడిపోయింది. బీపీ 130/90 , పల్స్ రేట్ 60గా నమోదయ్యాయి. కాగా, జగన్ నడుం నొప్పితో బాధ పడుతున్నారు. ఆయన వీలైనంత త్వరగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.