మండలంలోని ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న నారాయణం చలపతి సన్స్(ఎన్సీఎస్) షుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్ కన్నబాబు, ఫ్యాక్టరీ సీఈఓ మాధవరావుపై సోమవారం రాత్రి పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పొదలకూరు, న్యూస్‌లైన్: మండలంలోని ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న నారాయణం చలపతి సన్స్(ఎన్సీఎస్) షుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్ కన్నబాబు, ఫ్యాక్టరీ సీఈఓ మాధవరావుపై సోమవారం రాత్రి పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు అసిస్టెంట్ కేన్ కమిషనర్ జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వాస్తవానికి 2012 - 13 సీజన్లో చెరకు రైతుల బకాయిలకు సంబంధించిన రూ.14 కోట్లను చెల్లించే విషయమై ఫ్యాక్టరీ ఎండీ నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయిం చారు. బకాయిలను మూడు విడతలుగా మూడు నెలల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తొలుత డిసెంబర్ 16వ తేదీన రూ.5 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఎండీ చెల్లించలేదు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ శ్రీకాంత్ ఏసీసీ సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి రైతుల బకాయిలను చెల్లించని షుగర్‌ఫ్యాక్టరీ ఎండీపై కేసు పెట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశించడంతో ఏసీసీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.