ఈ నెల 11న సమైక్యాంధ్ర అడ్వకేట్స్ ఆధ్వర్యంలో మళ్లీ మానవహారం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. అందుకు సహకరించాలని ఆయన తెలంగాణ అడ్వకేట్స్ను కోరారు. సమైక్యాంధ్ర కోరుతున్న అడ్వకేట్స్ అందరితో ఈ నెల 28న ఓ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం మానవహారానికి సిద్దమైన సీమాంధ్ర అడ్వకేట్స్పై తెలంగాణ లాయర్ల దాడిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అందుకు నిరసనగా మంగళవారం హైకోర్టు ఆవరణలో సీమాంధ్ర అడ్వకేట్స్ బైటాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. హైకోర్టులో తెలంగాణ అడ్వకేట్స్కు అనుకూలంగా పోలీసులు వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ నగరంలో శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసినందుకు ఏపీఎన్జీవోలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనంతపురంలో ఈ నెల 14న అడ్వకేట్ జేఏసీ ప్రకటించిన నిరసన కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలుపుతున్నట్లు సీవీ మోహన్రెడ్డి ప్రకటించారు.