సమైక్యాంధ్ర సమ్మె ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈనెల 19 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనున్న తరుణంలో సీమాంధ్రలో 19 నుంచి తనిఖీ విధులను బహిష్కరిస్తున్నట్టు పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) సాంకేతిక విద్య కమిషనర్, ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్‌లకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది.
ఈనెల 17న సామూహిక సెలవులు పెడుతున్నట్టు, 19 నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ విధులను బహిష్కరిస్తున్నట్టు పాలా చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ నోటీసుల్లో పేర్కొన్నారు. సీమాంధ్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులు ఈనెల 19 నుంచి సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని హెల్ప్‌లైన్ సెంటర్లలో విధులకు హాజరుకారని చంద్రశేఖర్ విశాఖలో చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాష్ట్రవ్యాప్తంగా 57 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. వీటిలో 34 సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి.
ఈ హెల్ప్‌లైన్ సెంటర్లన్నీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోనే ఉన్నాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో కీలకమైన పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఆయా కళాశాలల సిబ్బంది విధుల బహిష్కరణ పిలుపునివ్వడంతో ఈ హెల్ప్‌లైన్ సెంటర్లు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలు ఆలస్యమవుతున్న తరుణంలో హెల్ప్‌లైన్ సెంటర్లు యథావిధిగా నడిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు.
కౌన్సెలింగ్ వాయిదా పడదని, ఈనెల 19న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగిస్తామని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ చెప్పారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగించాలని, తొలిరోజు పరిస్థితి చూసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై నీలినీడలు
Published Sat, Aug 17 2013 2:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement