రత్నగర్భ.. రాజధాని శోభ | seemandhra capital ia kurnool | Sakshi
Sakshi News home page

రత్నగర్భ.. రాజధాని శోభ

Published Mon, Mar 3 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

seemandhra capital ia kurnool

 కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: తెల్లదొరల దౌర్జన్యాలపై నా బిడ్డ నరసింహారెడ్డి తిరుగుబాటు చేసినప్పుడు నేను గర్వించాను.. డొక్కల కరువొచ్చి ఆకలితో అలమటిస్తున్న వారిని నా మరో బిడ్డ వెంగళ్‌రెడ్డి అన్నదానం చేసి ఆదుకున్నప్పుడు ఆనందించాను. రాజ్యాంగ నిర్మాణంలో నా ముద్ద బిడ్డ నాగప్ప పాలుపంచుకున్నందుకు పొంగిపోయాను.

భాషా ప్రయుక్తరాష్ట్రానికి నన్ను రాజధానిని చేసినప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు.. అయితే నేటి పరిస్థితిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. వీరేనా నా బిడ్డలు.. ప్రజలను పాలించే పాలకులు అని బాధపడుతున్నాను. నా త్యాగాన్ని విస్మరించి తెలుగు జాతిని నిలువునా చీల్చి నాకు గుండెకోతను మిగిల్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా నేను ఎలుగెత్తి చాటుతున్నాను.. నా వైభవాన్ని నాకు ఇవ్వమని కోరుతున్నాను. నన్ను రాజధాని చేయమని అడుతున్నాను. డిమాండ్ చేస్తున్నాను.  
 
 నదిచాగి వద్ద ప్రవేశిస్తున్న తుంగభద్ర..మంత్రాలయం, ఆదోని, కౌతాళం, ఎమ్మిగనూరు, నందవరం, కోడుమూరు, కర్నూలు మీదుగా అలంపూరు వద్ద కృష్ణానదితో సంగమిస్తోంది. కొన్నివేల ఎకరాల భూమిని తడుపుతూ సస్యశ్యామలం చేస్తోంది. హంద్రీ నది కర్నూలు, వెల్దుర్తి, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఆ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తోంది. కృష్ణా నది నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాలలో ప్రవహిస్తూ అక్కడ ప్రజల సాగునీటి కొరత తీరుస్తోంది. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తికి కృష్ణా జలమే మూలాధారం. ప్రణాళికాబద్ధంగా వీటిని పంపిణీ చేసుకుంటే వ్యవసాయపరమైన ప్రగతికి ఇది దోహదం చేస్తుంది.
 
 అవును కచ్చితంగా నేనే..
 ఈ సంక్లిష్ట సందర్భంలో సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని కావాల్సింది నేనే! అవును కచ్చితంగా నేనే.. ఏమిటీ! ఇంత నిక్కచ్చిగా, ఇంత జబర్దస్తీగా మాట్లాడుతున్నాననుకుంటున్నారా! నిజమే..నేనిప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. పౌరుషాల గడ్డ అనీ, పాలెగాళ్ల సీమ అనీ.. మాట మాట్లాడితే కత్తులు నూరుతారని నా జిల్లాకు పేరే గాని.. సీమ హక్కులు కాపాడుకోవడంలో అవి ఎప్పుడూ ఆచరణ రూపం దాల్చలేదు. అందుకే నేనిప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకొని ఘంటాపథంగా చెప్తున్నా.

పదమూడు జిల్లాల్లో రాజధాని కాగల లక్షణాలు ఎవరికున్నాయి అంటే.. నిస్సంకోచంగా నాకే ఉన్నాయి అంటాన్నేను. ఎందుకంటారా! నా చరిత్ర తెలుసు కదా మీకు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పటి పెద్దలు టంగుటూరి, నీలం సంజీవరెడ్డి పట్టుపట్టి నన్నే రాజధానిగా ఎంపిక చేశారు. శ్రీబాగ్ ఒడంబడికలో సీమ ప్రాంతం వెనుకబడిందనీ, దాని అభివృద్ధి జరగాలంటే కర్నూలు రాజధాని కావాల్సిందేనని నన్ను రాజధానిని చేశారు. చరిత్రపుటల్లో ఇంకొంచెం వెనకకు వెళ్తే నా పరిధిలో ఉన్న జొన్నగిరి ఒకప్పుడు అశోకుని రాజ్యానికి రాజధానిగా ఉండేది.

రాయలేలిన కాలంలో నేను రత్నగర్భను. అందుకే ఇప్పటికీ నా పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, పెరవలి, తుగ్గలి ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయి. సరే.. 1956లో విశాలాంధ్ర ఏర్పడబోతోందని, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పడటం అత్యవసరమని అప్పటి పెద్దలంతా సముదాయిస్తే నా జిల్లా ప్రజలు ఎంతో ఔదార్యంతో రాజధానిని హైదరాబాదుకు తరలించారు. తరలించినా ఇక్కడి నాయకులు, ప్రజలు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు సిరుల నిలయమైన హైదరాబాదు ఒకప్పుడు నేను పెట్టిన  భిక్ష అనే విషయం అందరూ గమనించాల్సి ఉంది.
 
 
 నా భూమి పునీతమైనది
 గుంటూరు, విజయవాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. నిత్యం తుపానుల బారిన పడి పునరావాస చర్యలు చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. నా పరిధిలోని భూమి భూకంపాలకు, సునామీలకు లొంగని ధృఢమైనది. పునీతమైనది. మంత్రాలయం, శ్రీశైలం, అహోబిలం, మహానంది, ఆదోని జామియా మసీదు, కర్నూలు సీఎస్‌ఐ చర్చి.. ప్రసిద్ధిగాంచిన అన్ని మతాలకు సంబంధించిన పుణ్యక్షేత్రా లు కల్గినది నా నేల.
 
 
 విస్తారమైన ప్రభుత్వ భూమి...
  నావద్ద రాజధానికి అవసరమైన ప్రభుత్వ భూమి విస్తారంగా ఉంది. ఓ చక్కని విమానాశ్రయం, ఐటీ పరిశ్రమలు నిర్మించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఉన్నత విద్యాలయాలు, కళాశాలలు నిర్మించుకునే అవకాశం ఉంది.
 
 పిడికిలి బిగించండి
 నా ప్రజలారా! పిడికిలి బిగిం చండి! ఇదే అదను. కదం తొక్కి కదలండి. ఇప్పుడైనా పౌరుషాలకు పదును పెట్టి, రాజధాని సాధనకు ముందుకు కదలండి!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement