సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ నిర్ణయం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధానికి లేఖ రాయాలని తీర్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమన్వయ కమిటీ నిర్ణయించింది. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం మంత్రి శైలజానాథ్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారధి, పి.బాలరాజు, టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీమోహన్, అహ్మదుల్లా, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, బి.ఎన్.విజయ్‌కుమార్, బొత్స అప్పలనర్సయ్య, కాండ్రు కమల, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కమిటీలో లేనప్పటికీ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, కె.సుధాకర్, రాజన్నదొర, తైనాల విజయకుమార్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభ్యుల మెజారిటీ అభిప్రాయాలు, ప్రజల మనోభావాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాల్సిందిగా రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని నేతలు నిర్ణయించారు. సోనియాగాంధీతో భేటీ కావాలనే అభిప్రాయం వ్యక్తమైనా.. ఢిల్లీ వెళ్లినా ఫలితం ఉండదని టీజీ వెంకటేశ్, గంటా శ్రీనివాసరావులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. పురందేశ్వరి సహా కొందరు కేంద్ర మంత్రులు విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఇంకా సమైక్యంగా ఉంచాలని అడగడం సరికాదంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తావించారు. మంత్రి బాలరాజు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారని కొందరు గుర్తుచేశారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై దిగ్విజయ్‌సింగ్‌ను కలిస్తే మేలని సూచించారు ‘విభజన అనివార్యం. మీ సమస్యలేమిటో చెప్పండి. పరిష్కరిస్తామని మాట మాత్రంగానైనా చెప్పడం లేదు. అలా చెబితే మనం కూడా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేసేవాళ్లం..’ అని మంత్రి పార్థసారధి అన్నారు. మనం ఏం చెబుతున్నా ఢిల్లీ స్థాయిలో జరగాల్సివన్నీ జరిగిపోతున్నాయని, అన్నీ పక్కనపెట్టి సమైక్య ఉద్యమంపై సమీక్షించాలని కన్నబాబు అన్నారు.
కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ విభజనపై నిర్ణయం జరిగిపోయినందున కాంగ్రెస్ లైన్లోనే వెళ్లాల్సిన అవసరముందన్నాగరు. మరికొందరు కూడా కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు ఢిల్లీ వెళ్లి తొలుత దిగ్విజయ్‌సింగ్‌ను కలవాలని నేతలు నిర్ణయించారు. సమావేశానంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించే విషయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దిగ్విజయ్‌సింగ్‌లను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు.