సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపును స్వాగతిస్తున్నామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, విప్ రుద్రరాజు పద్మరాజులతో కలసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బలం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. మరో మూడ్నాలుగురోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో సర్కారును ఏర్పాటు చేయడం వల్ల లాభం లేదన్నారు. పైగా అధికార దుర్విని యోగానికి పాల్పడ్డామన్న అపవాదు మోయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందన్నారు.
నిలకడ లేనివారు, రాజకీయ అజ్ఞానులు, అధికారమే పరమావధిగా ఉన్నవారే ఎన్నికల ముందు ఇతర పార్టీల్లో చేరుతుంటారన్నారు. వారిది అవకాశవాదం, కప్పదాటుగా అభివర్ణించారు. కిరణ్ ఐనా వేరొకరైనా ఇవే అంశాలు వర్తిస్తాయన్నారు. ‘‘పాలనా వ్యవహారాలు సాగేందుకు వీలుగా ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరితే.. తానుండబోనంటూ వ్యవస్థను చులకన చేసిన కిరణ్ గురించి ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రపతి పాలనపై అధికారిక నిర్ణయం జరిగాక కొత్త పార్టీ పెడతానంటున్న కిరణ్ వైఖరేదో తేలిన వెంటనే.. ఇకరోజూ ఆయన గురించే చెబుతాం. మీకు(మీడియాకు) తెలిసినవి చాలా తక్కు వ. మేము నోరు విప్పితే అనేకాంశాలు బయటికొస్తాయి’’ అని అన్నారు.