సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, కేబినెట్ నోట్ కూడా సిద్ధమైందని కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై రాజీనామాల ఒత్తిడి పెరుగుతోంది. 24న లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించుకుంటామని కొందరు ఎంపీలు ప్రకటించడంతో.. ఆ ప్రాంతానికి చెందిన పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ఎంపీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందితే తాము కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని వారు భావిస్తున్నారు. తాము ఇప్పటికే మంత్రి పదవులకు రాజీనామా చేశామని, వాటిని ముఖ్యమంత్రే ఆమోదించడం లేదంటూ ఇప్పటివరకు నెట్టుకొచ్చిన మంత్రులు... ఇకపై అలా చెబితే ప్రజలు ఏమాత్రం నమ్మరని భావిస్తున్నారు. కనీనం నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీలెవరూ రాజీనామా చేయకుండా కట్టడి చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఒక్కరు రాజీనామా చేసినా తమపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమనే ఆందోళనతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ‘‘రాష్ట్రాన్ని విభజింజేందుకే కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నందున దానిని అడ్డుకోవడానికి రాజీనామాలు చేయడం పరిష్కారం కాదు. చేసినా ఆమోదించేలా ఉన్నారు. అందువల్ల పదవుల్లో కొనసాగుతూనే బిల్లులు వ్యతిరేకించి విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిద్దాం. ఆ తర్వాత కూడా హైకమాండ్ మనసు మార్చుకోకుంటే అందరం కలిసి పార్టీని వీడే విషయంపై నిర్ణయానికి వద్దాం’’అని సీఎం రెండురోజుల కింద తనను కలిసిను ఎంపీలను ఉద్దేశించి పేర్కొన్నట్లు తెలిసింది.
ఆదివారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన సీమాంధ్ర మంత్రులు సాకే శైలజానాథ్, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రాజీనామా మాటలన్నీ డ్రామాలేనని ఆ పార్టీవర్గాలే కొట్టిపారేస్తున్నాయి. ఎలాగైనా సాధారణ ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగాలన్నదే వారి వ్యూహమని చెబుతున్నాయి. కేవలం ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యానే రాజీనామాల డ్రామాలాడుతున్నారని అభిప్రాయపడుతున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని భావిస్తున్నప్పటికీ సీఎం మోకాలడ్డుతున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విభజన తథ్యమని సీఎంకు పూర్తిగా అర్థమైపోయిందని, అందుకే చివరిక్షణం వరకు పదవిలో కొనసాగడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు విభజన నిర్ణయం ఖాయమని తేలడంతో రాయలసీమకు చెందిన కొందరు నేతలు మరోసారి రాయల తెలంగాణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రాజీనామా చేస్తే తల నరుక్కున్నట్లే: టీజీ
పదవులకు రాజీనామా చేయడమంటే తమ తలలు తాము నరుక్కున్నట్లేనని మంత్రి టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఏరాసు ప్రతాపరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజీనామాలు చేస్తే తెలంగాణ బిల్లును అడ్డుకునే అవకాశం ఉండదు. ఈ విషయం తెలుసుకున్న ఏపీఎన్జీవోలు రాజీనామా చేయొద్దని చెబుతున్నారు. ఈ మాట ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. సోమవారం సీఎంతోపాటు ఢిల్లీకి వెళుతున్నామని చెప్పారు. మంత్రి పదవులకు రాజీనామా చేయాలని భావించినప్పటికీ సీఎం వద్దనడం వల్లే ఆగిపోయామని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రులు, ఎంపీలెవరూ రాజీనామా చేయొద్దని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కోరారు. రాజీనామా చేస్తే ఢిల్లీ పెద్దలు తమను చీపురు పుల్లల్లా తీసిపారేస్తారని చెప్పారు. విభజన అనివార్యమైతే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నామని పేర్కొన్నారు.