సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఎలాగైనా ఆహార భద్రత బిల్లును అడ్డుకోవడం ద్వారా అధిష్ఠానాన్ని ఇరుకున పారేసి, ఒత్తిడి వ్యూహం అమలుచేయాలని తొలుత అనుకున్నా, కాంగ్రెస్ పెద్దలు రెండాకులు ఎక్కువే చదవడంతో వారికి చుక్కెదురైంది. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం విప్ జారీ చేయడంతో ఏం చేయాలోనన్న ఆలోచనలో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పడ్డారు.
తాజాగా అమలుచేయాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంట్లో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఆంటోనీ నేతృత్వంలో నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ఎదుట ఎటూ ఢిల్లీలోనే వాదనలు వినిపించాలి కాబట్టి, అక్కడ ఎలాంటి వాదనలు వినిపించాలనే విషయంపై చర్చలు మొదలుపెట్టారు. అలాగే, విప్ జారీ అయిన నేపథ్యంలో తాము అనుసరించాల్సిన వ్యూహంపైనా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు ముఖ్యంగా రాజ్యసభలో గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ రేసులో తాము వెనకబడిపోకుండా ఉండేందుకు ఏం చేయాలని కూడా కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
వ్యూహాలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మల్లగుల్లాలు
Published Wed, Aug 14 2013 9:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement