ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు లేనట్లే!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరగకపోవచ్చని, రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చునని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టవచ్చని... అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చని అధికారవర్గాలు తెలిపినట్లు పీటీఐ కథనంలో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి స్థానంలో మరో నాయకుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం విముఖంగా ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రపతి పాలన విషయమై వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చునని, అయితే దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలతోపాటు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తారని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42 లోక్‌సభ నియోజకవర్గాలుండగా... విభజన అనంతరం సీమాంధ్రలో 25, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలుంటాయి. అలాగే 294 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను సీమాంధ్రలో 175, తెలంగాణలో 119 నియోజకవర్గాలుంటాయి.