president ruling
-
‘మహా’ ట్విస్ట్: పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన తప్పదా?
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే బృందం అసలైన బాల్‌ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. మరో వైపు శివసేన కార్యకర్తలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వారి ఆఫీసులపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీస్ చీఫ్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు పాటిస్తున్నారు. ఈ తరుణంలో బలనిరూపణకై రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెట్టినా వారిపై శివసేన కార్యకర్తల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించే యోచనలో గవర్నర్ ఉన్నట్లు సమాచారం. గవర్నర్ కూడా ఓ వైపు ఎలాంటి అలజడులు లేకుండా పోలీస్ శాఖతో చర్చలు జరుపుతూనే మరోవైపు కేంద్రంతో ఎప్పటికప్పుడు ముంబైలోని పరిస్థితులను వివరిస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్రంతో పూర్తి స్థాయి చర్చించిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా ఎంపీ నవనీత్ కౌర్ రానా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరడం గమనార్షం. శివ సైనికుల గూండాయిజంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. మరో వైపు సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యే సతీమణీల ఇళ్లకు వెళ్తూ.. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని వారిని కోరుతున్నారు. చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే -
యథావిథిగా సంక్షేమపథకాలు : గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఈ రోజు ఆయన ఇక్కడ మీడియా సమావేవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలనలో అందరికీ సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించనట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రంలో పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పాలనకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం సరిగా అందాలని చెప్పారు. తమకు మొదటి ప్రాధాన్యత శాంతిభద్రతలేనన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగితే సహించేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారన్నారు. కలెక్టర్లు లెక్కలు చూసి సంతృప్తి పడొద్దని సలహా ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరును పర్యటనలు చేసి తెలుసుకోవాలన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణభూమి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలన చివరిలో జరిగిన నిర్ణయాలపై కొంత సమయం తర్వాత స్పందిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌కు తాను సన్నిహితమన్నదానికి అర్థం లేదన్నారు. ప్రొఫెషనల్‌గానే పనిచేశానని, పనిచేస్తానని నరసింహన్ చెప్పారు. -
రాష్ట్రపతి పాలనతో పోయిన పదవి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారీ నీటిపారుదల శాఖా మంత్రి పి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి అయ్యా రు. తెలంగాణ రాష్ట్ర విభజనతో పాటు రాష్ట్రపతి పాలనకు ప్రణబ్‌ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేయడంతో ఆయ న హవాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కేంద్ర కేబినెట్ సిఫారసు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయ గా... జిల్లాలో పాలనపగ్గాలు చేతులు మారాయి. రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి కానుం డగా... ఇకపై కలెక్టర్ జిల్లా పాలనా వ్యవహారాల్లో మరింత కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లడంతో ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే స్థితిలో ఉంటారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో శాసనసభను రద్దుచేసే అంశాన్ని పేర్కొనకపోవడంతో ఎమ్మెల్యే పదవులకు ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. బోధన్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి మద్యం వ్యాపారంలో కొనసాగుతూ 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరంలో మొదటిసారిగా బోధన్ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లలో సైతం గెలిపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్‌లో రికార్డు నెలకొల్పా రు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా మొదటిసారి ఛాన్స్ దక్కగా, కిరణ్‌కుమా ర్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రపతి పాలనతో మంత్రి పదవిని కోల్పోయారు. దీంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి హోదాలో ఆయనకుండే ప్రొటోకాల్ రద్దయిపోతుంది. అయితే మంత్రి పదవికి దూరమైన ఆయన మాత్రం ఎమ్మెల్యేగా కొనసాగుతారు. పాలనపై అధికార ముద్ర... రాష్ర్టపతి పాలనకు ఆమోదముద్ర పడటంతో ఇకపై జిల్లా పాలనపై పూర్తిగా అధికార ముద్ర ఉంటుంది. ఇప్పటి వర కు మంత్రి, ఇన్చార్జి మంత్రులు, రాజ కీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యం త్రాంగం చూస్తుంది. గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లా పాలన సాగించనుండగా... రాజకీయ పలుకుబడులు, ఒత్తిళ్లకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే కీలకం కానుండటంతో ఆయనతో పాటు ఏ జిల్లా ఉన్నతాధికారిపైనా రాజకీయ పెత్తనానికి అస్కారం ఉండదు. అలా గే జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపైనా అధికార యంత్రాంగానిదే గురుతర బాధ్యత. -
ఇది అసమంజసం!
సంపాదకీయం గత కొన్ని రోజులుగా వెలువడుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచింది. రాష్ట్రంలో వరసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టడమే కాదు...రెండోసారి దేశాన్నేలడానికి వీలుకల్పించిన తెలుగు ప్రజలపట్ల యూపీఏ సర్కారు పోతూ పోతూ చేసిన ఆఖరి అపచారమిది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలననూ, పథకాలనూ మెచ్చి ఆ పార్టీకి రెండోసారి కూడా ఓటేసిన జనం... ఆయన కనుమరుగయ్యాక నాలుగున్నరేళ్లనుంచి ఎన్నో వైపరీత్యాలను చూస్తున్నారు. ఇప్పుడొచ్చిన రాష్ట్రపతి పాలన ఆ వరసలో మరొకటి. ఇక్కడా, కేంద్రంలోనూ పాలకపక్షంగా తామే ఉన్నా తదుపరి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తమ వల్లకాలేదంటే ఆ చేతగానితనానికి కాంగ్రెస్ నాయకత్వం సిగ్గుపడాలి. ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించడానికి మన రాజ్యాంగంలోని 356వ అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తున్నది. కానీ, ఆ అధికరణాన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలని మన రాజ్యాంగ నిర్మాతలు లక్షించారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ సక్రమంగా మనగలగాలంటే ఇది అవసరమని వారు భావించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ సైతం ‘అన్ని ప్రత్యామ్నాయాలూ నిరుపయోగమైనప్పుడు, గత్యంతరంలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే’ 356వ అధికరణాన్ని వినియోగించాలని సూచించింది. దురదృష్టవశాత్తూ దేశంలో ఆ అధికరణాన్ని సక్రమంగా వినియోగించిన సందర్భాలకంటే, ఉల్లంఘించిన ఉదంతాలే అధికం. ఇందిరాగాంధీ ఈ విషయంలో రికార్డు సృష్టించారు. 1967-77మధ్య 356వ అధికరణను ఆమె విచక్షణారహితంగా వినియోగించారు. ఆ పదేళ్లకాలంలో 40సార్లు ఉపయోగించి విపక్షాల నేతృత్వంలో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేశారు. ఆమె తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. ఇష్టారాజ్యంగా సాగిపోతున్న ఈ బాపతు చేష్టలకు 1994లో బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కళ్లెంవేసింది. ఎలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. కానీ, కేంద్రంలోని పాలకులు అడపా దడపా ఆ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేస్తే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిపితే తమకు ఇంతకింతా పరాభవం తప్పదని గ్రహింపునకు రాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి పాలనంటే రాజకీయ నేతల జోక్యం లేని పరిపాలన మాత్రమేనని కొందరు చెబుతున్నారు. ఎటూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి గనుక... కోడ్ అమల్లోకి వచ్చి సారాంశంలో రాజకీయ నేతల జోక్యం అంతరిస్తుంది గనుక రాష్ట్రపతి పాలన వల్ల అదనంగా వచ్చే మార్పేమీ ఉండదని వారంటున్న మాటలు నిజమే కావొచ్చు. ఎలాగూ పోయే ప్రాణమే కదానని పీకనొక్కడం ఎంత తప్పో ఇదీ అంతే తప్పు. ప్రజా ప్రభుత్వం నడవడానికి అవసరమైన పరిస్థితులున్నప్పుడు ఒక్కరోజు కూడా దానికి విఘాతం కలగనీయ కూడదు. స్థానిక సంస్థల్లోనే ప్రత్యేకాధికారుల పాలన వద్దని న్యాయ స్థానాలు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాలనను అధికారగణానికి అప్పజెప్పడం అసమంజసం. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో ఏ పార్టీ లేనప్పుడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు, చట్టసభకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలి. మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులేమీ ఇప్పుడులేవు. సంక్షోభమంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించడమెలాగో తెలియని నాయకత్వంలో ఉంది. వాస్తవానికి 2009లో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటించినప్పుడు అలాంటి రాజకీయ అస్థిరత ఏర్పడింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలకు క్యూ కట్టారు. శాసనసభ పనిచేయగలదో, లేదోనన్న సందేహం తలెత్తింది. అలాగే, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటికి రెండుసార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొనవలసిన సందర్భాలు వచ్చాయి. ఆ సమయాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సహకారంతో గట్టెక్కింది. అప్పుడు సైతం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి సంక్షోభాన్ని దాటిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు కాళ్లూ చేతులూ ఆడక స్థాణువులా ఉండిపోయింది. అలాంటి నాటకాన్ని ఇప్పుడూ కొనసాగించవచ్చునని కాంగ్రెస్ మొదట్లో భావించకపోలేదు. కానీ, ఆచరణలో అది బెడిసికొట్టక తప్పదని అంచనా వేసుకుంది. ఎందుకంటే, కీలుబొమ్మల్ని తప్ప నాయకులుగా ఎదిగేవారిని సహించే తత్వం కాంగ్రెస్ అధిష్టానంలో లేదు. పర్యవసానంగా పట్టుమని పదిమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని అర్భకులే పార్టీలో మిగిలారు. వారిలో కూడా చాలామంది ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్‌నుంచి జారుకోవడమే మంచిదని భావిస్తున్నారు. కొందరు ఇప్పటికే బయటికె ళ్లారు. ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉన్న ఇంతటి విపత్కర స్థితిలో ప్రభుత్వం ఏర్పాటుకు సాహసిస్తే దివాలాకోరు సర్కారు ఏర్పాటుచేసిన అపఖ్యాతి మిగులుతుందని, ఎన్నికల ముందు తన్నులాటలతో వీధినపడతామని ఆ పార్టీ అధినాయకులు అంచనాకొచ్చినట్టు కనబడుతోంది. పర్యవసానంగా రాష్ట్రపతి పాలన దిశగా పావులు కదిలాయి. అయితే ఈ క్రమంలో తప్పుడు సంప్రదాయానికి తిరోగమించామని, రాజ్యాంగ విలువలను కాలరాశామని కాంగ్రెస్ అధినాయకత్వం గ్రహిస్తే మంచిది. -
రాష్ట్రపతి పాలనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. రాష్ట్రపతి పాలనపై గవర్నర్ నరసింహన్ పంపిన నివేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతృప్తి వ్యక్తం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలైంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆర్టికల్ 356 ప్రకారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో భాగంగా సీఎం, మంత్రులు పదవీ కాలాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంపై సుదీర్ఘంగా తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. అలాగే.. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా రాష్ట్రపతికి నివేదించింది. శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి ఈ రోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడంతో రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతికి అందనున్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ.. రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా కేంద్రమే నడిపించనుంది. -
రాష్ట్రపతి పాలనకు సీపీఐ, బీజేపీ ఖండన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ సిఫార్సు చేయడాన్ని సీపీఐ, బీజేపీలు ఖండించాయి. కేంద్రంలో, రాష్ట్రం లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతూ రాష్ట్రపతి పాలన విధించడాన్ని శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఆక్షేపించాయి. ఎన్నికల ప్రకటన మరో వారంలో ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో ఎందుకు రాష్ట్రపతి పాలన విధించారో ప్రజలకు వివరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రాష్ట్ర ప్రజల పాలిట ఇది చీకటి రోజని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సీపీఎం సమర్థన: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సీపీఎం సమర్థించింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకనే కేంద్రమంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధింపునకు తమ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రానికి మరో ప్రత్యామ్నాయం లేకపోయినట్టు కనిపిస్తోందన్నారు. రాష్ర్టపతి పాలన మినహా గత్యంతరం లేదు.. రావుల: రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన మినహా మరే గత్యంతరం లేదని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్రపతి పాలన విధించటానికి ఇంత జాప్యం ఎందుకు జరిగిందో కేంద్రం వివరణ ఇవ్వాలన్నారు. రాజ్యాంగ ప్రక్రియనూ కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొందన్నారు. -
రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపును స్వాగతిస్తున్నామని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, విప్ రుద్రరాజు పద్మరాజులతో కలసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బలం కాంగ్రెస్‌కు ఉన్నప్పటికీ.. మరో మూడ్నాలుగురోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో సర్కారును ఏర్పాటు చేయడం వల్ల లాభం లేదన్నారు. పైగా అధికార దుర్విని యోగానికి పాల్పడ్డామన్న అపవాదు మోయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సన్నద్ధంగా ఉందన్నారు. నిలకడ లేనివారు, రాజకీయ అజ్ఞానులు, అధికారమే పరమావధిగా ఉన్నవారే ఎన్నికల ముందు ఇతర పార్టీల్లో చేరుతుంటారన్నారు. వారిది అవకాశవాదం, కప్పదాటుగా అభివర్ణించారు. కిరణ్ ఐనా వేరొకరైనా ఇవే అంశాలు వర్తిస్తాయన్నారు. ‘‘పాలనా వ్యవహారాలు సాగేందుకు వీలుగా ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరితే.. తానుండబోనంటూ వ్యవస్థను చులకన చేసిన కిరణ్ గురించి ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రపతి పాలనపై అధికారిక నిర్ణయం జరిగాక కొత్త పార్టీ పెడతానంటున్న కిరణ్ వైఖరేదో తేలిన వెంటనే.. ఇకరోజూ ఆయన గురించే చెబుతాం. మీకు(మీడియాకు) తెలిసినవి చాలా తక్కు వ. మేము నోరు విప్పితే అనేకాంశాలు బయటికొస్తాయి’’ అని అన్నారు. -
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు లేనట్లే!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరగకపోవచ్చని, రాష్ట్రపతి పాలన తప్పకపోవచ్చునని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టవచ్చని... అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చని అధికారవర్గాలు తెలిపినట్లు పీటీఐ కథనంలో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి స్థానంలో మరో నాయకుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం విముఖంగా ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రపతి పాలన విషయమై వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చునని, అయితే దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలతోపాటు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తారని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42 లోక్‌సభ నియోజకవర్గాలుండగా... విభజన అనంతరం సీమాంధ్రలో 25, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలుంటాయి. అలాగే 294 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను సీమాంధ్రలో 175, తెలంగాణలో 119 నియోజకవర్గాలుంటాయి.