రాష్ట్రపతి పాలనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. రాష్ట్రపతి పాలనపై గవర్నర్ నరసింహన్ పంపిన నివేదికపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతృప్తి వ్యక్తం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలైంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆర్టికల్ 356 ప్రకారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో భాగంగా సీఎం, మంత్రులు పదవీ కాలాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంపై సుదీర్ఘంగా తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. అలాగే.. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా రాష్ట్రపతికి నివేదించింది. శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి ఈ రోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించడంతో రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతికి అందనున్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ.. రాష్ట్రపతి, గవర్నర్‌ల ద్వారా కేంద్రమే నడిపించనుంది.