సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ సిఫార్సు చేయడాన్ని సీపీఐ, బీజేపీలు ఖండించాయి. కేంద్రంలో, రాష్ట్రం లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగుతూ రాష్ట్రపతి పాలన విధించడాన్ని శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఆక్షేపించాయి. ఎన్నికల ప్రకటన మరో వారంలో ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో ఎందుకు రాష్ట్రపతి పాలన విధించారో ప్రజలకు వివరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రాష్ట్ర ప్రజల పాలిట ఇది చీకటి రోజని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
సీపీఎం సమర్థన: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సీపీఎం సమర్థించింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకనే కేంద్రమంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధింపునకు తమ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రానికి మరో ప్రత్యామ్నాయం లేకపోయినట్టు కనిపిస్తోందన్నారు.
రాష్ర్టపతి పాలన మినహా గత్యంతరం లేదు.. రావుల: రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన మినహా మరే గత్యంతరం లేదని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్రపతి పాలన విధించటానికి ఇంత జాప్యం ఎందుకు జరిగిందో కేంద్రం వివరణ ఇవ్వాలన్నారు. రాజ్యాంగ ప్రక్రియనూ కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొందన్నారు.