- భూ వినియోగహక్కు చట్టంపై అసెంబ్లీలో విపక్షాల ఫైర్
- సవరించాల్సిందేనని డిమాండ్.. అంగీకరించని ప్రభుత్వం
- నిరసనగా సభ నుంచి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వాకౌట్
- మూజువాణి ఓటుతో నాలుగు బిల్లులకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: వాటర్‌గ్రిడ్ పథకంలో పైప్‌లైన్ల నిర్మాణం కోసం తీసుకువస్తున్న భూ వినియోగహక్కు (రైట్ టు యూజ్) చట్టం సరికాదని.. అది రైతుల హక్కులను కాలరాసే చట్టమని పేర్కొంటూ బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బిల్లులో పలు సవరణలు చేయాలని డిమాండ్ చేశాయి. కానీ సవరణలకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో మజ్లిస్ మినహా మిగతా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. భూవినియోగ హక్కు చట్టంతో సహా ఐదు బిల్లులను సర్కారు బుధవారం సభలో ప్రవేశపెట్టగా... మూడు బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఈ బిల్లులన్నీ మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
భూసేకరణ చేపట్టాలి..
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించుకునే హక్కు కోసం రూపొందించిన ‘భూవినియోగహక్కు’ బిల్లును రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి పలు అభ్యంతరాలను లేవనెత్తారు. ‘‘భూవినియోగహక్కు అంటున్న ప్రభుత్వం ఆ భూమిపై మొక్కలు నాటకూడదు, నిర్మాణాలు చేయకూడదు, బావులు, జలాశయాలు తవ్వ కూడదంటూ.. ఆంక్షలు విధించడమేమిటి? ఆంక్షల కారణంగా రైతులు హక్కును కోల్పోతారు. కేవలం మార్కెట్ విలువలో పదిశాతం ఇచ్చి రైతులను మోసం చేయాలని చూస్తే ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతాయి.
తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. మార్కెట్ విలువకు నాలుగింతలు పరిహారం ఇచ్చే భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలి..’’ అని డిమాండ్ చేశారు. భూ వినియోగహక్కు వల్ల రైతులతో పాటు పట్టణాల్లోని ప్లాట్ల యజమానులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో రిలయన్స్ గ్యాస్ పైపులైన్ నిర్మాణం వల్ల రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది మంది నష్టపోయారని గుర్తుచేశారు. బిల్లును అబయెన్స్‌లో పెట్టి, సెలక్ట్ కమిటీకి నివేదించాలని కోరారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీందర్ స్పష్టం చేశారు.
రైతులకు ఇబ్బంది ఉండదు: కేటీఆర్
భూవినియోగహక్కు కింద రైతుల హక్కులకు ఎటువంటి ఆటంకం ఏర్పడదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉపరితలానికి రెండు మీటర్ల లోతులో వేసే పైప్‌లైన్ల వలన వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు రావన్నారు. పంట నష్టపోయే రైతులకు పంట పరిహారంతో పాటు భూమి మార్కెట్ విలువలో పదిశాతం (కలెక్టర్ నిర్ధారించిన మేరకు) నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. భారీగా పెరిగే చెట్లయితే పైప్‌లైన్ పగులుతుందనిగాని, సాధారణ వ్యవసాయానికి ఎటువంటి ఆంక్షలు ఉండబోవన్నారు. పైప్‌లైన్‌కు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే వారికి జైలుశిక్ష ఉంటుందని బిల్లులో పేర్కొన్నామని.. జైలు శిక్షలు రైతులకు అనడం సరికాదని మంత్రి చెప్పారు. వీలైనంత వరకు పైప్‌లైన్ ఏర్పాటంతా రెవెన్యూ, అటవీ భూముల్లోనే జరిగేలా చూస్తామన్నారు.
మూడు బిల్లులకు నో..
భూవినియోగబిల్లు, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీకాలం ఏడాదికి తగ్గింపు బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. చిన్న రాష్ట్రానికి తగినంత మంది మంత్రులున్నా.. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవీ కాలాన్ని ఏడాదికి తగ్గించడమంటే.. విపక్షాలకు చెందిన చైర్మన ్లను తొలగించే కుట్రలో భాగమేనని ఆరోపించాయి. అయితే వ్యాట్ సవరణ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు బిల్లులను అన్నిపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.