సంపాదకీయం
గత కొన్ని రోజులుగా వెలువడుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ యూపీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచింది. రాష్ట్రంలో వరసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టడమే కాదు...రెండోసారి దేశాన్నేలడానికి వీలుకల్పించిన తెలుగు ప్రజలపట్ల యూపీఏ సర్కారు పోతూ పోతూ చేసిన ఆఖరి అపచారమిది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలననూ, పథకాలనూ మెచ్చి ఆ పార్టీకి రెండోసారి కూడా ఓటేసిన జనం... ఆయన కనుమరుగయ్యాక నాలుగున్నరేళ్లనుంచి ఎన్నో వైపరీత్యాలను చూస్తున్నారు. ఇప్పుడొచ్చిన రాష్ట్రపతి పాలన ఆ వరసలో మరొకటి. ఇక్కడా, కేంద్రంలోనూ పాలకపక్షంగా తామే ఉన్నా తదుపరి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తమ వల్లకాలేదంటే ఆ చేతగానితనానికి కాంగ్రెస్ నాయకత్వం సిగ్గుపడాలి. ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించడానికి మన రాజ్యాంగంలోని 356వ అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తున్నది. కానీ, ఆ అధికరణాన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలని మన రాజ్యాంగ నిర్మాతలు లక్షించారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థ సక్రమంగా మనగలగాలంటే ఇది అవసరమని వారు భావించారు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ సైతం ‘అన్ని ప్రత్యామ్నాయాలూ నిరుపయోగమైనప్పుడు, గత్యంతరంలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే’ 356వ అధికరణాన్ని వినియోగించాలని సూచించింది. దురదృష్టవశాత్తూ దేశంలో ఆ అధికరణాన్ని సక్రమంగా వినియోగించిన సందర్భాలకంటే, ఉల్లంఘించిన ఉదంతాలే అధికం. ఇందిరాగాంధీ ఈ విషయంలో రికార్డు సృష్టించారు. 1967-77మధ్య 356వ అధికరణను ఆమె విచక్షణారహితంగా వినియోగించారు. ఆ పదేళ్లకాలంలో 40సార్లు ఉపయోగించి విపక్షాల నేతృత్వంలో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేశారు. ఆమె తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. ఇష్టారాజ్యంగా సాగిపోతున్న ఈ బాపతు చేష్టలకు 1994లో బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కళ్లెంవేసింది. ఎలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. కానీ, కేంద్రంలోని పాలకులు అడపా దడపా ఆ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేస్తే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిపితే తమకు ఇంతకింతా పరాభవం తప్పదని గ్రహింపునకు రాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రపతి పాలనంటే రాజకీయ నేతల జోక్యం లేని పరిపాలన మాత్రమేనని కొందరు చెబుతున్నారు. ఎటూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడనున్నాయి గనుక... కోడ్ అమల్లోకి వచ్చి సారాంశంలో రాజకీయ నేతల జోక్యం అంతరిస్తుంది గనుక రాష్ట్రపతి పాలన వల్ల అదనంగా వచ్చే మార్పేమీ ఉండదని వారంటున్న మాటలు నిజమే కావొచ్చు. ఎలాగూ పోయే ప్రాణమే కదానని పీకనొక్కడం ఎంత తప్పో ఇదీ అంతే తప్పు. ప్రజా ప్రభుత్వం నడవడానికి అవసరమైన పరిస్థితులున్నప్పుడు ఒక్కరోజు కూడా దానికి విఘాతం కలగనీయ కూడదు. స్థానిక సంస్థల్లోనే ప్రత్యేకాధికారుల పాలన వద్దని న్యాయ స్థానాలు చెబుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాలనను అధికారగణానికి అప్పజెప్పడం అసమంజసం. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో ఏ పార్టీ లేనప్పుడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగినప్పుడు, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు, చట్టసభకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించాలి. మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులేమీ ఇప్పుడులేవు. సంక్షోభమంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ సంక్షోభాన్ని పరిష్కరించడమెలాగో తెలియని నాయకత్వంలో ఉంది. వాస్తవానికి 2009లో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటించినప్పుడు అలాంటి రాజకీయ అస్థిరత ఏర్పడింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలకు క్యూ కట్టారు. శాసనసభ పనిచేయగలదో, లేదోనన్న సందేహం తలెత్తింది. అలాగే, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటికి రెండుసార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొనవలసిన సందర్భాలు వచ్చాయి.
ఆ సమయాల్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సహకారంతో గట్టెక్కింది. అప్పుడు సైతం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి సంక్షోభాన్ని దాటిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు కాళ్లూ చేతులూ ఆడక స్థాణువులా ఉండిపోయింది. అలాంటి నాటకాన్ని ఇప్పుడూ కొనసాగించవచ్చునని కాంగ్రెస్ మొదట్లో భావించకపోలేదు. కానీ, ఆచరణలో అది బెడిసికొట్టక తప్పదని అంచనా వేసుకుంది. ఎందుకంటే, కీలుబొమ్మల్ని తప్ప నాయకులుగా ఎదిగేవారిని సహించే తత్వం కాంగ్రెస్ అధిష్టానంలో లేదు. పర్యవసానంగా పట్టుమని పదిమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని అర్భకులే పార్టీలో మిగిలారు. వారిలో కూడా చాలామంది ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్‌నుంచి జారుకోవడమే మంచిదని భావిస్తున్నారు. కొందరు ఇప్పటికే బయటికె ళ్లారు. ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉన్న ఇంతటి విపత్కర స్థితిలో ప్రభుత్వం ఏర్పాటుకు సాహసిస్తే దివాలాకోరు సర్కారు ఏర్పాటుచేసిన అపఖ్యాతి మిగులుతుందని, ఎన్నికల ముందు తన్నులాటలతో వీధినపడతామని ఆ పార్టీ అధినాయకులు అంచనాకొచ్చినట్టు కనబడుతోంది. పర్యవసానంగా రాష్ట్రపతి పాలన దిశగా పావులు కదిలాయి. అయితే ఈ క్రమంలో తప్పుడు సంప్రదాయానికి తిరోగమించామని, రాజ్యాంగ విలువలను కాలరాశామని కాంగ్రెస్ అధినాయకత్వం గ్రహిస్తే మంచిది.