కేరళలోని అళప్పుళా సాయ్ హాస్టల్‌లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సంపాదకీయం
దేశానికి మెరికల్లాంటి అథ్లెట్లను తయారు చేయాలన్న సంకల్పంతో భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లలో పరిస్థితులు సవ్యంగా లేవని ఇటీవలికాలంలో తరచుగా వెల్లడవుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. నాలుగురోజులక్రితం కేరళలోని అళప్పుళా సాయ్ హాస్టల్‌లో నలుగురు బాలికల ఆత్మహత్యాయత్నం ఆ పరంపరకు కొనసాగింపే. ఆత్మహత్యాయత్నం చేసిన పిల్లలు 16, 17 ఏళ్ల లోపు వారు. వీరిలో అపర్ణ అనే బాలిక మృతిచెందగా మిగిలినవారు కోలుకుంటున్నారు. ఆటల్లో ఆసక్తి ఉన్న పిల్లలు సాధారణంగా ఈ శిక్షణ కేంద్రాల్లో చేరతారు. తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించే స్థోమత లేని కుటుంబాలు కూడా ఇటు వైపు మొగ్గుచూపుతాయి. ఆటల్లో చురుగ్గా ఉంటున్నారు గనుక అందులోనే శిక్షణని ప్పిస్తే...ఆ పిల్లలకు వేళకింత తిండి దొరుకుతుందని, అదృష్టం బాగుండి ఆటల్లో రాణిస్తే వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఆ కుటుంబాలు ఆశిస్తాయి. నిరుపేదలైన అపర్ణ తల్లిదండ్రులు కూడా అలా ఆశించే ఆమెను సాయ్ శిక్షణ కేం ద్రంలో చేర్పించారు. అపర్ణ కూడా చాలా చురుగ్గా ఉంటూ రోయింగ్‌లో మెలకు వలు నేర్చుకుంది. ఆ క్రీడలో కేరళకు గుర్తింపు తీసుకురావడమే కాదు...నిరుడు లక్నోలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంశ్య పతకం సంపాదించి భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యంవహించగల స్థాయికి ఎదగగలుగుతుందన్న భరోసాను కలిగిం చింది. కానీ, అక్కడి హాస్టల్ పరిస్థితులు ఆమెకా అవకాశాన్నివ్వలేదు. బంగారు భవిష్యత్తును అందుకోగల సత్తా ఉన్న బాలికను మొగ్గ దశలోనే తుంచేశాయి.
ఈ నలుగురు పిల్లలూ ఆత్మహత్యాయత్నం చేసుకునేవరకూ అసలు హాస్టల్ స్థితిగతులపై వార్డెన్‌తోసహా ఎవరికీ సరైన అవగాహన లేదని అర్థమవుతోంది. తమను సీనియర్లు వేధిస్తున్నారని, అడుగడుగునా అవమానిస్తున్నారని నలుగురూ కలిసి రాసిన లేఖలో ఆరోపించాక అదంతా నిజం కాదంటూ కప్పిపుచ్చే ప్రయ త్నాలు బయల్దేరాయి. క్రమశిక్షణ ఉల్లంఘించారని మందలించాక ఈ నలుగురూ అవమానానికి లోనై విష ఫలాలు తిని చనిపోవడానికి ప్రయత్నించారన్న సంజా యిషీలు వెలువడుతున్నాయి. మిగిలిన ముగ్గురి మాటేమోగానీ అపర్ణ విషయంలో కోచ్ ఈ ఆరోపణను కాదంటున్నాడు. ఆమె ఎంతో క్రమశిక్షణతో నేర్చుకునేదని, అడుగడుగునా తనకేర్పడే సందేహాలు తీర్చుకుని ఆ ఆటలో క్రమేపీ ఎదిగివచ్చిం దని చెబుతున్నాడు. ఆటల్లో అంత శ్రద్ధను కనబర్చేవారు హాస్టల్‌లో వేరొకలా ఉన్నారంటే నమ్మడం సాధ్యమేనా? దేశంలోని వివిధ సాయ్ కేంద్రాల్లో ఇలాంటి ఉదంతాలు లోగడ సైతం చోటుచేసుకున్నాయి. హర్యానాలోని హిస్సార్‌లోని సాయ్ హాస్టల్‌లో జాతీయ జూడో చాంపియన్ సతీందర్‌కుమార్ 2006లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో అతని సహచరులిద్దరికి యావజ్జీవ శిక్ష పడింది. 2010లో అంతర్జాతీయ స్థాయి బాక్సర్ సోనూ చాహల్ భివానీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శిక్షణ తీసుకుంటున్న ఆడపిల్లలను కోచ్‌లు లైంగిక వేధించడం, వారిపై అత్యాచా రయత్నాలు చేయడంవంటివి ఇటీవలికాలంలో తరచు వెల్లడవుతున్నాయి. గత రెండేళ్లలో ఇలాంటి ఆరోపణలపై ముగ్గురు కోచ్‌లను అరెస్టుచేశారు. ఒకరిని సస్పెండ్ చేశారు. శిక్షణ పొందుతున్నవారు ఏదైనా కారణంవల్ల సరిగా ఆడలేని సందర్భాలొచ్చినప్పుడు కోచ్‌లు అందరిలోనూ వారిని ఎగతాళి చేయడం, కఠినంగా మాట్లాడటం సర్వసాధారణమని చాలామంది చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో తరచు ఫిర్యాదులొస్తున్నప్పుడు సాయ్ ఉన్నతాధికారులు సున్నితంగా ఆలోచించి ఉండాలి. పిల్లలతో ఎలా మెలగాలో కోచ్‌లకు శిక్షణ ఇప్పించి ఉండాలి. అలాగే, ఆ కోచ్‌ల వ్యవహారశైలిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసివుండాలి. క్రీడల్లో శిక్షణ కోసం వచ్చేవారంతా టీనేజ్‌లో ఉండే పిల్లలు. ఆ వయసులో అమ్మానాన్నల దగ్గరుండేవారే మానసికంగా ఎంతో సతమతమవుతుంటారు. అయినవారికి దూరంగా, అక్కున చేర్చుకునేవారెవరూ లేని చోట అలాంటివారు ఎన్ని ఇబ్బం దులు పడతారో ఇక చెప్పనవసరం లేదు. ఆ వయసు పిల్లలకు మానసిక నిపుణు లను, ఇతరత్రా కౌన్సెలింగ్ ఇచ్చేవారిని అందుబాటులో ఉంచితే అది వారికెంతో ఉపయోగపడుతుంది. తాము సరిగా ఆడలేని సందర్భాలొచ్చినా, ఎవరైనా తమను వేధించినా చెప్పుకోవడానికి వీలుంటుంది.
తరచుగా ఫిర్యాదులొస్తున్నా సాయ్ ఈ విషయంలో ఆలోచించిన దాఖలా లేదు. దాని ఆధ్వర్యంలో నడుస్తున్న దాదాపు 250 కేంద్రాలు, వాటికి అనుబంధం గా ఉండే హాస్టళ్లలో దాదాపుగా అరాచకం రాజ్యమేలుతున్నదని...వాటిని నెల కొల్పిన ఉద్దేశమే దెబ్బతింటున్నదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆటల్లో రాణిం చాలని, మంచి పాటవాన్ని ప్రదర్శించి పెకైదగాలని కోరుకునే పిల్లలపై ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇంకొక్క అడుగు ముందుకేస్తే తాము కన్న కలలు నెరవేరగలవన్న ఆత్రుత ఉంటుంది. అవతలివారికన్నా తాము ఎందుకు వెనబడి ఉంటున్నామన్న వ్యథ కుంగదీస్తుంది. అభద్రత నిత్యమూ వెన్నాడుతుంటుంది. ఇలాంటి ఒత్తిళ్లతోపాటు ఆటల్లో అనుకోకుండా కలిగే గాయాలుంటాయి. ఈ సందర్భాలన్నిటా ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు, ట్రైనర్లు, మానసిక నిపుణుల అవసరం ఉంటుంది. వీటన్నిటికీ మించి నిత్యమూ ఎంతో శారీరక శ్రమ అవసర మయ్యే సాధనలో నిమగ్నులై ఉంటారు గనుక ఆ పిల్లలకు మంచి పోషకాహారం అందుబాటులో ఉంచాలి. ఇందులో ఏదీ సవ్యంగా లేదని...పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పట్టించుకునేలా సాయ్ హాస్టళ్లుగానీ, శిక్షణ కేంద్రాలుగానీ ఉండటం లేదని చెబుతున్నారు. నిర్లక్ష్యమూ, వేధింపులూ, వివక్షా ఇంతగా వ్యవస్థీ కృతం అయ్యాయి గనుకే అంతర్జాతీయ క్రీడా వేదికల్లో మన దేశం రాణించలేక పోతున్నది. అళప్పుళా ఉదంతమైనా మన పాలకుల కళ్లు తెరిపిస్తుందని, క్రీడారంగ ప్రక్షాళనకు కదిలిస్తుందని ఆశించాలి.