మళ్లీ విద్యుత్ చార్జీల మోత! | power charges hiked in telangana, andhrapradesh | Sakshi
Sakshi News home page

మళ్లీ విద్యుత్ చార్జీల మోత!

Published Mon, Feb 9 2015 2:03 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

power charges hiked in telangana, andhrapradesh

 మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రజలకు వచ్చే నెలలో కరెంటు చార్జీల షాక్ రాసిపెట్టి ఉందని నిర్ధారణ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,261 కోట్ల భారం వేయడానికి రంగం సిద్ధమవుతుండగా... తెలంగాణలో ఇది రూ. 1,089 కోట్ల వరకూ ఉండొచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి. దేశం ఆర్థిక సంస్కరణల మార్గం పట్టాక విద్యుత్ చార్జీల పెంపులో ఓ కొత్త పద్ధతి అమలు కావడం మొదలైంది. రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డులు రద్దయి...రంగంలోకి విద్యుత్ నియంత్రణ కమిషన్(ఈఆర్‌సీ)లు, డిస్కంలు, ట్రాన్స్‌కోలు వచ్చిపడ్డాక విద్యుత్ వినియో గదారులకు హఠాత్తుగా షాకిచ్చే విధానం మాయమైంది. పెంచబోయే విద్యుత్ చార్జీలపై వినియోగదారులను దశలవారీగా మానసికంగా సిద్ధం చేసే సృజనాత్మక విధానం ఒకటి ప్రారంభమైంది. ముందు డిస్కంలు విద్యుత్ సరఫరాలో తమకు వస్తున్న నష్టాలను ఏకరువు పెడుతూ ఈఆర్‌సీకి నివేదికలందజేస్తాయి. ఏమేరకు చార్జీలు పెంచవలసివస్తుందో ప్రతిపాదనలు సమర్పిస్తాయి. అలా సమర్పించే ముందు ప్రభుత్వంతో చర్చించి అనుమతి తీసుకోవడం రివాజు. డిస్కంలు చేసిన ప్రతిపాదనలపై ఈఆర్‌సీ సమీక్షించి, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. చివరకు చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి చార్జీలను ‘బాగా ఎక్కువ’గా పెంచాలని ఆంధ్రప్రదేశ్‌లో డిస్కంలు సూచించినా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకించిందని కథనాలు వెలువడ్డాయి. 15 శాతం పెంచాలన్న డిస్కంల సూచనను ప్రభుత్వం తిరస్కరిస్తే కనీసం 10 శాతం పెంపుకైనా అనుమతించాలని అవి విన్నవించుకున్నాయట. కానీ, దీన్ని కూడా తిరస్కరించి ముందుగా ప్రత్యామ్నాయాలను పరిశీలించి రమ్మని వెనక్కి పంపారట. ఈ కర్మకాండ అంతా పూర్తయ్యాక 6 శాతం మేరకు చార్జీలు పెంపును ప్రతిపాదిస్తూ ఏపీ డిస్కంలు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. తెలంగాణలోనూ కొంచెం తేడాతో ఇదే నడిచింది. కాకపోతే డిస్కంల చార్జీల ప్రతిపాదనలు అత్యంత గోప్యంగా ఉండిపోయాయి. ఈఆర్‌సీకి ఇచ్చాకగానీ ఆ ప్రతిపాదనల వివరాలు బయటకు పొక్కలేదు. మొత్తానికి 5.75 శాతం మేర పెంచడానికి డిస్కంలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రెండు రాష్ట్రాలూ ఎవరికి వారు అవతలివారు ఏమేరకు పెంచుతారో చూసి దాన్నిబట్టి తాము నిర్ణయించుకోవాలనుకున్నందున ప్రతిపాదనల సమర్పణలో కాస్తంత జాప్యం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఎంత పెంచదల్చుకున్నదో తెలిశాకే తెలంగాణ డిస్కంల ప్రతిపాదనలు ఆఖరి నిమిషంలో ఈఆర్‌సీకి వెళ్లాయి. ఏపీతో పోలిస్తే ‘తక్కువ’ పెంచిన కీర్తి కూడా దక్కింది.
 
 రెండుచోట్లా చార్జీలు పెరిగినా బోలెడు లోటు ఉంటుందని వార్షిక రాబడి, అవసరాల నివేదికలు(ఏఆర్‌ఆర్‌లు) చెబుతున్నాయి. మొత్తంగా తమకు రూ. 6,721 కోట్లు నష్టం వస్తున్నదని తెలంగాణ డిస్కంలు తేల్చితే...తమ నష్టం 7,716 కోట్లని ఏపీ డిస్కంలు వెల్లడించాయి. చార్జీలు పెంచదల్చుకున్నప్పుడల్లా నష్టాల వాదనలే తెరపైకి వస్తాయి. డిస్కంలిచ్చే ప్రతిపాదనలను మరో మాట లేకుండా ప్రభుత్వాలు ఆమోదిస్తాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దీనికి మినహాయింపు. విద్యుత్ చార్జీలను పెంచబోమని 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆయన ప్రభుత్వం తు చ తప్పకుండా అమలు చేసింది. మరో అయిదేళ్లపాటు కూడా పెంచేది లేదని ఆయన 2009 ఎన్నికల్లో చెప్పారు. అయితే, ఆయన కనుమరుగైన అనంతరం వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు రకరకాల పేర్లతో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపాయి. ఇదంతా దాదాపు రూ. 33,000 కోట్లు!  తమకు అధికారం అప్పగిస్తే విద్యుత్ చార్జీలు పెంచ బోమని మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ప్రకటించారు. కానీ, ఇతర వాగ్దానాల్లాగే దాన్ని కూడా మూలనపడేశారు. నిజానికి విపక్షంలో ఉన్నప్పు డు చార్జీల పెంపును ఆయన గట్టిగా వ్యతిరేకించారు గనుక అధికారంలోకి రాగానే వాటిని వెనక్కు తీసుకోవాలి. కనీసం హామీ ఇచ్చిన  ప్రకారం కొత్తగా చార్జీలైనా పెం చకుండా ఉండాలి. కానీ ఆయన చార్జీల పెంపు దోవనే ఎంచుకు న్నారు. నిరుపేద వినియోగదారులను ఇబ్బంది పెట్టడంలేదని చెప్పడంవ ంటివన్నీ కంటి తుడుపు కబుర్లు. వాటికంత విలువ లేదు. పరిశ్రమలపైనా, వాణిజ్య వినియో గదారులపైనా మోపే భారం అంతిమంగా సాధారణ ప్రజానీకానికే వివిధ రూపాల్లో బదిలీ అవుతుంది. డిస్కంలకు నష్టాలు వస్తున్న మాట నిజమే అయినా వాటిని పూడ్చు కోవడం కేవలం చార్జీల పెంపుద్వారా మాత్రమే సాధ్యమని వాదించడం ప్రజలను పక్కదోవ పట్టించడమే. అంతర్జాతీయంగా పెట్రో ధరలు... మరీ ముఖ్యంగా బొగ్గు, గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఇదిగాక కాలంచెల్లిన ట్రాన్స్‌ఫార్మర్ల నూ, ఇతర పరికరాలనూ మార్చడం...పటిష్టమైన నిఘాతో వాణిజ్య చౌర్యానికి అడ్డుకట్టవేయడం వంటి చర్యలవల్ల విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో జరిగే నష్టాన్ని అరికట్టడం వీలవుతుంది. ఇలాంటి అంశాలపై దృష్టిపెట్టకుండా సులభంగా అయి పోయే చార్జీల పెంపు మార్గాన్నే ఎంచుకోవడం ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేయ డమే అవుతుంది. చార్జీల పెంపుపై వచ్చిన ప్రతిపాదనలపై కొంచెం అటూఇటుగా నిర్ణయాలు తీసుకోవడం కాక ఈఆర్‌సీలు కూడా హేతుబద్ధంగా వ్యవహరించాలి. విద్యుత్ సంస్థల్లో అడుగంటుతున్న క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచడానికి కృషి చేయాలి. డిస్కంలకొచ్చే నష్టాలను ఇతరత్రా పూడ్చుకోవడానికి ఏమేరకు వీలున్న దో సూచనలివ్వాలి. రిటైర్డ్ అధికారులతో నిండివుండే ఈఆర్‌సీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాయని భావించబట్టే వాటికి హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారి నేతృత్వం ఉండాలని నిరుడు సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే నెలలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణల తర్వాత ఈఆర్‌సీలు ప్రభుత్వాలకు సరైన మార్గ నిర్దేశనం చేయగలిగితే ప్రజలు సంతోషిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement