గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఈ రోజు ఆయన ఇక్కడ మీడియా సమావేవంలో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలనలో అందరికీ సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించనట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రంలో పటిష్టమైన భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పాలనకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం సరిగా అందాలని చెప్పారు.
తమకు మొదటి ప్రాధాన్యత శాంతిభద్రతలేనన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగితే సహించేది లేదని, ఎంతవరకైనా వెళతామని హెచ్చరించారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారన్నారు. కలెక్టర్లు లెక్కలు చూసి సంతృప్తి పడొద్దని సలహా ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరును పర్యటనలు చేసి తెలుసుకోవాలన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణభూమి అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పాలన చివరిలో జరిగిన నిర్ణయాలపై కొంత సమయం తర్వాత స్పందిస్తానని చెప్పారు. కాంగ్రెస్కు తాను సన్నిహితమన్నదానికి అర్థం లేదన్నారు. ప్రొఫెషనల్గానే పనిచేశానని, పనిచేస్తానని నరసింహన్ చెప్పారు.